అక్షర ఉదయమ్
Date of Publish : 11 September 2026, 6:33 pm Posted by : అక్షర ఉదయమ్

చుక్క రక్తం తీయకుండానే.. ఏఐ ముఖ స్కాన్‌తో 60 సెకన్లలో 60 రకాల పరీక్షల రిపోర్టులు

చుక్క రక్తం తీయకుండానే.. ఏఐ ముఖ స్కాన్‌తో 60 సెకన్లలో 60 రకాల పరీక్షల రిపోర్టులు

 

  • మంగళగిరిలో అందుబాటులోకి సరికొత్త ఏఐ సాంకేతికత 
  • నిమిషం వ్యవధిలోనే 60 రకాల వైద్య పరీక్షల నివేదికలు
  • ఇందిరానగర్‌ పీహెచ్‌సీలో ఏరోస్ వెల్నెస్ ఏఐ క్లినిక్ ఏర్పాటు

 

అక్షర ఉదయమ్ – మంగళగిరి

 

ఆసుపత్రికి వెళ్లి రక్త పరీక్ష చేయించుకోవాలంటే సూది గుచ్చి రక్తం తీస్తారని భయపడే వారికి ఇది శుభవార్త. ఇకపై వైద్య పరీక్షల కోసం సూది గుచ్చాల్సిన పని లేదు. చుక్క రక్తం కూడా తీయాల్సిన అవసరం లేదు. నివేదిక కోసం గంటల తరబడి ల్యాబ్‌ల వద్ద వేచి చూడక్కర్లేదు. కేవలం ముఖాన్ని స్కాన్ చేస్తే చాలు. నిమిషం వ్యవధిలోనే 60 రకాల ఆరోగ్య పరీక్షల నివేదికలు మీ చేతికి అందుతాయి. రాష్ట్రంలోనే తొలిసారిగా ఈ అత్యాధునిక కృత్రిమ మేధ సాంకేతికత గుంటూరు జిల్లా మంగళగిరిలో అందుబాటులోకి వచ్చింది.

 

  • పైలట్ ప్రాజెక్టు షురూ..

 

మంగళగిరిలోని ఇందిరానగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ)లో ‘ఏరోస్‌ వెల్‌నెస్‌ ఏఐ క్లినిక్‌’ సేవలను ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. పైలట్ ప్రాజెక్టుగా ట్రయల్ రన్ చేపట్టారు. ఇందులో భాగంగా మాణిక్యమ్మ అనే మహిళకు ముఖ స్కాన్ ద్వారా వైద్యులు రక్త పరీక్షలు నిర్వహించి, డిజిటల్ నివేదికలను పరిశీలించారు. ఈ పీహెచ్‌సీలో గతంలో పరీక్షలు చేయించుకున్న వారందరికీ గురువారం నుంచి ఏఐ ద్వారా ముఖస్కాన్ పరీక్షలు నిర్వహిస్తామని ఎన్‌సీడీసీడీ జాయింట్ డైరెక్టర్ శ్యామల తెలిపారు. రెండు రోజుల పాటు స్థానిక సిబ్బందికి దీనిపై పూర్తి స్థాయి శిక్షణ ఇస్తామన్నారు. ఈ పైలట్ ప్రాజెక్టు సత్ఫలితాలు ఇస్తే ఈ విధానాన్ని మరింత విస్తరిస్తామని వెల్లడించారు.

 

  • అసలు స్కాన్ ఎలా చేస్తారంటే..?

 

ఈ అత్యాధునిక ఏఐ సాంకేతికత రోగి నాడుల సంకేతాలు, ముఖంలో కలిగే మార్పుల ఆధారంగా పని చేస్తుంది. రక్తం సేకరించకుండానే కేవలం ముఖ స్కాన్‌తో ముందుగా 28 రకాల పరీక్షల వివరాలను గుర్తిస్తారు. ఆ తర్వాత ఈ నివేదికలను ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సాంకేతికతతో అనుసంధానించి లోతుగా విశ్లేషించి, మరో 32 రకాల వైద్య పరీక్షలు చేస్తారు. మొత్తంగా కేవలం 60 సెకన్ల వ్యవధిలోనే 60 రకాల హెల్త్ రిపోర్టులు డిజిటల్ రూపంలో స్క్రీన్‌పై వస్తాయి. దీనిద్వారా రక్తపోటు (బీపీ), మధుమేహం (షుగర్), గుండె జబ్బుల ముప్పుతో పాటు పలు దీర్ఘకాలిక వ్యాధులను ప్రాథమిక దశలోనే సులువుగా గుర్తించవచ్చు.

 

  • దేశంలో మూడో రాష్ట్రంగా ఏపీ

 

రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రత్యేక చొరవ, సహకారంతో మంగళగిరిలో ఈ అత్యాధునిక ఏఐ క్లినిక్ ఏర్పాటైంది. ‘ఏరోస్ ఇన్నోవేషన్, ఐఐవీపీఎల్’ భాగస్వామ్యంతో ఏరోస్ వెల్నెస్ ఈ సాంకేతికతను రాష్ట్రానికి తీసుకొచ్చింది. దేశంలో గుజరాత్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల తర్వాత ఈ టెక్నాలజీని ప్రవేశపెడుతున్న మూడో రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా వైద్యారోగ్య శాఖాధికారిణి విజయలక్ష్మి, ఏరోస్ సీఈవో డాక్టర్ శిల్పా దేశాయ్ పరిశీలించారు. ఈ స్కాన్‌ను ఎలా వినియోగించాలన్న దానిపై ఆసుపత్రి వైద్యురాలు అనూష పరుచూరికి వారు అవగాహన కల్పించారు.