రూట్స్ హెల్త్ ఫౌండేషన్ సేవలు అమోఘం

రూట్స్ హెల్త్ ఫౌండేషన్ సేవలు అమోఘం

విజయవాడ వరదల సమయంలో వీరి సేవలు అద్వితీయం

— ఎస్. సవిత, రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ ల మంత్రి

 

అక్షర ఉదయమ్ – విజయవాడ

సేవా దృక్పధంతో గత 12 సంవత్సరాలుగా పేదలకు, క్యాన్సర్ వ్యాధి గ్రస్తులకు సేవలు అందిస్తున్న రూట్స్ హెల్త్ ఫౌండేషన్ ఎంతో మందికి ఆదర్శనీయమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ ల మంత్రి శ్రీమతి ఎస్. సవిత తెలిపారు. మొఘల్ రాజ్ పురంలోని పీబీ సిద్ధార్ధ కాలేజీ ఆడిటోరియంలో ఆదివారం రూట్స్ హెల్త్ ఫౌండేషన్ వారు డాక్టర్స్ దినోత్సవం సందర్భంగా రూట్స్ హెల్త్ సర్వీస్ అవార్డ్స్–2025 సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ రూట్స్ హెల్త్ ఫౌండేషన్ ద్వారా ఎంతో మందికి వైద్య సేవలు అందిస్తున్నారన్నారు. గత 12 సంవత్సరాలుగా వైద్య వృత్తిలో అత్యుత్తమ సేవలు అందించిన 82 మంది డాక్టర్స్ ను గౌరవించి సన్మానించటం మంచి పరిణామమన్నారు. ఈ స్ఫూర్తితో వీళ్లు మరింతగా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారన్నారు. విజయవాడ వరదల సమయంలో కూడా వారి సేవలను నేను ప్రత్యక్షంగా చూశానన్నారు. రాబోయే రోజుల్లో రూట్స్ ఫౌండేషన్ వారు విద్యార్ధులకు మరింతగా తమ వైద్య సేవలు అందించాలన్నారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా వైద్య రంగానికి ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా రూ. 20,000 కోట్లను బడ్జెట్ లో కేటాయించారన్నారు. రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రగా మార్చాలన్నదే ముఖ్యమంత్రి సంకల్పమన్నారు. అంతేకాకుండా రాష్ట్రాన్ని హరితాంధ్ర గా మార్చేందుకు కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టి పూర్తి చేశారన్నారు. ప్రజల ఆరోగ్యానికి ఉపయోగపడేలా యోగాంధ్ర-2025 ను గిన్నిస్ వరల్డ్ రికార్డులో నమోదు అయ్యేలా చేశారన్నారు. రాష్ట్రంలో ఆర్గానిక్ ఫుడ్ ను ప్రోత్సహించేలా కృషి చేస్తున్నారన్నారు. ప్రభుత్వం మంచి కార్యక్రమాలను ప్రోత్సహించేందుకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందన్నారు. రాయలసీమలో కూడా ఇలాంటి వైద్య సేవలు అందించే కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు.

విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దే రామ్మోహన్ రావు మాట్లాడుతూ వైద్య రంగంలో రూట్స్ ఫౌండేషన్ సేవలు అద్వితీయమన్నారు. ఎంతో మంది వైద్య ప్రముఖులకు వారు సమాజానికి అందించిన సేవలకు గుర్తింపుగా వైద్య అవార్డులు అందించటం మంచి పరిణామమన్నారు. నా వంతుగా ఇలాంటి మంచి కార్యక్రమాలకు ఆర్థికంగా సాయం అందిస్తాననన్నారు.

క్యాన్సర్ తో బాధపడుతున్న 12 ఏళ్ల భక్త సింగ్ అనే బాలుడుకు రూట్స్ హెల్త్ ఫౌండేషన్ రూ. 10,000 ఆర్థిక సాయాన్ని అందించారు. వైద్య వృత్తిలో నిష్ణాతులైన డాక్టర్స్ కు రూట్స్ హెల్త్ సర్వీస్ అవార్డు-2025 ను అందించారు.

కార్యక్రమంలో రాష్ట్ర ఎన్జీవో అధ్యక్షులు ఏ. విద్యా సాగర్, హీరో సుమన్, రూట్స్ హెల్త్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ పోలవరపు విజయ భాస్కర్, డాక్టర్ రమణ మూర్తి, డాక్టర్ సమరం, డాక్టర్ ఎన్ మరళీకృష్ణ, సిద్దార్ధ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ఏవై రావు, ఫిలిమ్ ఛాంబర్ చైర్మన్ శ్రీనివాస రాజు, తదితరలు, వైద్య విద్యార్ధులు, తదితరలు పాల్గొన్నారు.

 

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..

www.aksharaudayam.in