అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన 6 డ్రోన్లను జిల్లా పోలీస్ శాఖకు బహూకరించిన దాతలు

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన 6 డ్రోన్లను జిల్లా పోలీస్ శాఖకు బహూకరించిన దాతలు

  • దాతలను అభినందించి ఘనంగా సన్మానించిన జిల్లా ఎస్పీ
  • అసాంఘిక కార్యకలాపాల కట్టడి, నేరాల నియంత్రణకు డ్రోన్లతో నిఘా కీలకం

జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపీఎస్

 

అక్షర ఉదయమ్ – బాపట్ల

 

అసాంఘిక కార్యకలాపాల కట్టడి, నేరాల నియంత్రణలో డ్రోన్ల ద్వారా నిఘా కీలకమని జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపీఎస్ తెలిపారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన 6 డ్రోన్లను దాతలు బుధవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ చేతుల మీదుగా సంబంధిత పోలీస్ అధికారులకు అందజేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి వినూత్న ఆలోచనలతో ప్రేరణ పొందిన దాతలు, జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, నిఘా, విపత్తుల నిర్వహణ కోసం సామాజిక బాధ్యతతో, సేవా దృక్పథంతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన DJI MINI 3 డ్రోన్లను జిల్లా పోలీస్ శాఖకు బహూకరించారు. పోలీస్ శాఖ తరఫున దాతలను జిల్లా ఎస్పీ ఘనంగా సన్మానించి, ప్రశంసా పత్రాలు అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.

 

 

నిజాంపట్నం పోలీస్ స్టేషన్‌కు రాఘవేంద్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ తరఫున కావలి నియోజకవర్గ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఒక డ్రోన్, నిజాంపట్నంలోని ఏ.బి.ఏ.డి ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు బ్లూ పెర్ల్ మెరైన్ కంపెనీలు సంయుక్తంగా మరో డ్రోన్, మొత్తంగా రెండు డ్రోన్లను బహూకరించారు. రేపల్లె పట్టణ పోలీస్ స్టేషన్‌కు రేపల్లెలోని డి.పి.ఎస్ ఫుడ్స్ వారు ఒక డ్రోన్, భట్టిప్రోలు పోలీస్ స్టేషన్‌కు కొల్లూరు మండలం జువ్వలపాలం చెందిన వేములపల్లి రవికిరణ్ ఒక డ్రోన్, చెరుకుపల్లి పోలీస్ స్టేషన్‌కు చెరుకుపల్లి మండలంలోని ఎన్ఎస్ఎల్ టెక్స్టైల్స్ (NSL Textiles) వారు ఒక డ్రోన్, వేమూరు పోలీస్ స్టేషన్‌కు హైదరాబాద్‌కు చెందిన యోషిత హౌసింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఒక డ్రోన్ బహూకరించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని స్మార్ట్ పోలీసింగ్ వైపు అడుగులు వేస్తున్న జిల్లా పోలీస్ శాఖను మరింత పటిష్టం చేసేందుకు ఈ డ్రోన్లు మద్దతుగా నిలుస్తాయని తెలిపారు. నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడి, ట్రాఫిక్ సమస్యల నియంత్రణకు డ్రోన్లు ఎంతగానో ఉపయోగ పడతాయి అన్నారు. వివిఐపీ బందోబస్తు, బహిరంగ సభలు, తిరునాళ్లు, ఊరేగింపుల వంటి కార్యక్రమాల్లో జన సమూహాన్ని పర్యవేక్షించేందుకు, అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా డ్రోన్ ల వినియోగించడం జరుగుతోందన్నారు. అలాగే మారుమూల ప్రాంతాల్లోని పేకాట స్థావరాలు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ న్యూసెన్స్ చేసే వారిపై నిఘా ఉంచడంలో డ్రోన్ల వాడకం కీలకమన్నారు. పోలీసులు భౌతికంగా వెళ్లలేని ప్రాంతాల్లో పరిస్థితుల్ని అంచనా వేయడానికీ డ్రోన్లు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయన్నారు.

దాతలు కొత్తగా అందజేసిన 6 డ్రోన్లను

రేపల్లె పట్టణ పోలీస్ స్టేషన్‌కు – 1

భట్టిప్రోలు పోలీస్ స్టేషన్‌కు – 1

చెరుకుపల్లి పోలీస్ స్టేషన్‌కు – 1

వేమూరు పోలీస్ స్టేషన్‌కు – 1

నిజాంపట్నం పోలీస్ స్టేషన్‌కు – 2

చొప్పున అందజేశామని తెలిపారు. డ్రోన్లను సమర్థవంతంగా వినియోగించుకుని నేర నియంత్రణలో పటిష్టంగా వ్యవహరించాలని సంబంధిత పోలీస్ అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో రేపల్లె డీఎస్పీ ఏ. శ్రీనివాసరావు, రేపల్లె టౌన్ ఇన్‌స్పెక్టర్ మల్లికార్జున రావు, రేపల్లె రూరల్ సీఐ సురేష్ బాబు, వేమూరు సీఐ ఆంజనేయులు, నిజాంపట్నం, భట్టిప్రోలు, వేమూరు, చెరుకుపల్లి ఎస్‌ఐలు మరియు దాతలు పాల్గొన్నారు.

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..

www.aksharaudayam.in