స్మార్ట్ రైస్ కార్డులు పంపిణీ చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్

స్మార్ట్ రైస్ కార్డులు పంపిణీ చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్

అక్షర ఉదయమ్ – మచిలీపట్నం

రాష్ట్రంలో చౌక దుకాణాల ద్వారా పారదర్శకంగా నిత్యావసర సరుకులు పొందుట కోసం స్మార్ట్ రైస్ కార్డులు ఎంతగానో ఉపయోగపడతాయని రాష్ట్ర పౌరసరఫరాలు శాఖ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు

సోమవారం మధ్యాహ్నం రాష్ట్ర మంత్రివర్యులు రాష్ట్ర పౌరసరఫరాల కమిషనర్ సౌరబ్ గౌర్ , సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ లతో కలసి పెనమలూరు నియోజకవర్గం లోని పోరంకి బిజేఆర్ నగర్ లో లబ్ధిదారుల ఇంటింటికి తిరిగి వారికి స్మార్ట్ రైస్ కార్డులను పంపిణీ చేశారు.

అనంతరం మంత్రివర్యులు పోరంకి డీలర్ సిహెచ్ దుర్గారాణి చౌక దుకాణాన్ని తనిఖీ చేసి అందులో ఉన్న స్టాకు వివరాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రివర్యులు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొనిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక  పౌర సదపరాల శాఖలో అనేక సంస్కరణలు చేపట్టిందన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రంలో కొత్తగా ఒక కోటి 46 లక్షల  గృహాలకు గాను 4.42 కోట్ల స్మార్ట్ రైస్ కార్డులు పంపిణీ చేస్తున్నామన్నారు.

ఈ స్మార్ట్ రైస్ కార్డు వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయని,  ముఖ్యంగా పారదర్శకంగా నిత్యవసర సరుకులు పొందడంతో పాటు కార్డులో ఉన్న క్యూఆర్ కోడ్ కు స్కాన్ చేస్తే మనం తీసుకున్న నిత్యవసర సరుకుల సమాచారం ఫోన్ లోకి వస్తుందన్నారు. ఏ సమయంలో ఏ సరుకులు తీసుకున్నారో తెలుస్తుందన్నారు.

నూతన సంస్కరణల వలన చౌక దుకాణం డీలర్ నుండి ప్రతినెల 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు నిత్యవసర సరుకులు లబ్ధిదారులకు కావలసిన సమయంలో పొందే అవకాశం వచ్చిందన్నారు.

కార్డులో ఇంటి చిరునామాలు, కుటుంబ వివరాలు చేర్పులు మార్పులు సహజంగా గ్రామ వార్డు సచివాలయాల లో దరఖాస్తు చేసుకుంటే అదే రోజు వారు అప్లోడ్ చేస్తారని ఇంటిగ్రేటెడ్ డేటా అప్రోచ్ ద్వారా డేటా అంతా జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ సంయుక్త కలెక్టర్,  రాష్ట్ర స్థాయిలో పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో కమిషనర్ వద్ద పొందుపరచబడి సమాచార లోపం లేకుండా చేసుకోవచ్చన్నారు.

ఎవరికైనా ఏమైనా ఇబ్బంది ఉంటే కార్డు పైన ఉన్న 196 కాల్ సెంటర్  నంబర్ కు  ఫోన్ చేసి  చెప్పవచ్చన్నారు కృష్ణా జిల్లాలో 5,17,825  క్యూ ఆర్ కోడ్ ఉన్న స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ జరుగుతుందన్నారు.

అందులో పెనమలూరు నియోజకవర్గంలో దాదాపు 92 వేల స్మార్ట్ రైసు కార్డులు పంపిణీ చేస్తున్నామన్నారు.

ఈ కార్డులను పౌరసరఫరాల శాఖ ఉద్యోగులతో పాటు గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది కూడా పంపిణీ చేస్తారన్నారు. ఈ కార్డు ఒక గుర్తింపు కార్డు లాగా కూడా పనిచేస్తుందని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ఉద్యోగ రీత్యా గాని చదువు రీత్యా గాని ఎక్కడికి వెళ్ళినా అక్కడ చౌక దుకాణాల నుండి నిత్యవసర సరుకులు పొందే సౌలభ్యం కల్పించామన్నారు

పెనమలూరు శాసనసభ్యులు బోడె ప్రసాద్ మాట్లాడుతూ ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా నూతన సాంకేతిక పరిజ్ఞానంతో పాత కార్డుకు అనుసంధానం చేస్తూ స్మార్ట్ బియ్యం కార్డులను గుర్తింపు కార్డుల రూపంలో మన రాష్ట్రంలో తొలిసారిగా ప్రవేశపెట్టి మరీ ముఖ్యంగా తన నియోజకవర్గంలో లబ్ధిదారులకు  అందజేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ లకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.

ఈ కార్డు ఒకవేళ పోతే 196 టోల్ ఫ్రీ నెంబర్ కు తెలియజేసి దరఖాస్తు చేసిన పక్షంలో 50 రూపాయల ఖర్చుతో కొత్త కార్డును ఇంటికే పోస్ట్ ద్వారా పంపడం జరుగుతుందన్నారు.

కార్డులోని క్యూఆర్  కోడ్ కు స్కాన్ చేసి ఏ రోజు చౌక దుకాణం  వెళ్లారు, ఏ సరుకులు తెచ్చుకున్నారు అన్ని వివరాలు తెలుసుకోవచ్చన్నారు.

సాంకేతికత పరిజ్ఞానంతో కార్డు అనుసంధానమై ఉన్నందున దుర్వినియోగం చేసే అవకాశం లేదన్నారు. అంతేకాకుండా ఎలాంటి నష్టం లేకుండా సరుకులు పంపిణీ చేయవచ్చన్నారు.

ఈ కార్యక్రమంలో డి ఎస్ ఓ మోహన్ బాబు,  ఉయ్యూరు ఆర్డిఓ బిఎస్ హేలా షారోన్ ,తహసిల్దారు గోపాలకృష్ణ, తాడిగడప మునిసిపల్ కమిషనర్ నజీర్,  వీఆర్వో పవన్ తదితర అధికారులు, అనధికారులు, ప్రజలు పాల్గొన్నారు.

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..

www.aksharaudayam.in