జీఎస్టీ స్లాబుల సరళీకరణ – పర్యాటక, సినిమా రంగాలకు ఊతం

జీఎస్టీ స్లాబుల సరళీకరణ – పర్యాటక, సినిమా రంగాలకు ఊతం

 

  • రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్
  • జీఎస్టీ సంస్కరణలతో తక్కువ ధరల్లో వినోదం
  • పర్యాటక, సినిమా రంగాల బలోపేతానికి దోహద పడుతుందన్న మంత్రి దుర్గేష్
  • బడ్జెట్ ట్రావెలర్, డొమెస్టిక్ టూరిజంలకు ప్రోత్సాహం లభిస్తుందన్న మంత్రి
  • సినిమా ప్రొడక్షన్ సేవలన్నీ18% శ్లాబ్ పరిధిలోకి లోకి వస్తాయని, ఇది నిర్మాతలకు ఆర్ధికంగా మేలు చేస్తుందని స్పష్టం
  • ఈ సందర్భంగా ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ప్రత్యేక అభినందనలు తెలిపిన మంత్రి కందుల దుర్గేష్

 


అక్షర ఉదయమ్ – అమరావతి

దేశంలో పన్ను వ్యవస్థను సులభతరం చేయడం కోసం జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మక మైనదని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఇప్పటి వరకు అమలులో ఉన్న నాలుగు స్లాబుల (5%, 12%, 18%, 28%) స్థానంలో ఇకపై కేవలం రెండు స్లాబులు – 5%, 18% మాత్రమే అమలులోకి వస్తాయని తద్వారా ప్రజలకు నేరుగా లాభం కలగనుందని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జీఎస్టీ సంస్కరణల్లో భాగంగా సేవా ఆధారిత రంగాలైన పర్యాటక, సినిమాటోగ్రఫీ రంగాలపై ప్రభావం పడనుందని అన్నారు. వీటికి టాక్స్ తగ్గితే ఉపాధి పెరుగుతుంది. స్థానిక ఆర్థిక వ్యవస్థ బలపడుతుందన్నారు. ప్రత్యేకించి హోటల్ రూమ్ టారిఫ్‌లు రూ.7,500 లోపు ఉన్న వాటిపై పన్ను 12% నుండి 5%కు తగ్గింపు ఉంటుందన్నారు. ఎకానమీ క్లాస్ విమాన టికెట్లపై GST 12% నుండి 5% కు తగ్గింపు ఉంటుందని, అదే విధంగా రెస్టారెంట్ బిల్లులపై పన్ను కూడా 12–18% నుండి 5%కి తగ్గించబడుతుందన్నారు. అంతేగాక బడ్జెట్ ట్రావెలర్, డొమెస్టిక్ టూరిజంలకు ప్రోత్సాహం లభిస్తుందని వెల్లడించారు. సినిమా రంగం విషయానికి వస్తే సినిమా టికెట్లు రూ.100 లోపు ఉంటే 12% GST, రూ.100 పైగా ఉంటే 18% GST కొనసాగుతుందని అన్నారు. పాత 28% రేటు పూర్తిగా రద్దు అవుతుందన్నారు. సినిమా ప్రొడక్షన్ సేవలు (editing, dubbing, VFX) అన్నీ 18% శ్లాబ్ పరిధిలోకి వస్తాయని, ఇది నిర్మాతలకు ఆర్ధికంగా మేలు చేస్తుందని స్పష్టం చేశారు. ఈ జీఎస్టీ సంస్కరణలు సాధారణ ప్రజలకు చవకైన ప్రయాణం, తక్కువ ధరల్లో వినోదం కలిగించడమే కాకుండా, పర్యాటక రంగం, సినిమా రంగం బలోపేతం కావడానికి దోహదం చేస్తాయని వివరించారు. అన్ని వర్గాలకు లబ్ధి చేకూర్చే సంస్కరణలు తెచ్చిన ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ అభినందనలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ అగ్ర స్థానానికి చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మార్పులు “సులభ పన్ను – బలమైన ఆర్థిక వ్యవస్థ” లక్ష్యాన్ని చేరుకునే దిశగా పెద్ద అడుగుగా నిలుస్తాయని మంత్రి కందుల దుర్గేష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..

www.aksharaudayam.in