రాష్ట్ర ఐ.ఎం.ఏ ఆధ్వర్యంలో వైద్యులకు మధుమేహంపై సర్టిఫికెట్ కోర్సు

ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ శాఖ, ఐ.ఎం.ఏ కాలేజ్ ఆఫ్ జనరల్ ప్రాక్టీషనర్స్ రాష్ట్ర శాఖ సంయుక్త ఆధ్వర్యంలో డయాబెటాలజీపై ఒక సంవత్సరం సర్టిఫికెట్ కోర్సును నిర్వహిస్తున్నట్టు ఐ.ఎం.ఏ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ గార్లపాటి నందకిషోర్, డాక్టర్ ఎం.సుభాష్ చంద్రబోస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐ.ఎం.ఏ వైద్యులకు ఈ కోర్సు నవంబర్ నెలలో ప్రారంభం అవుతుందన్నారు. ఈ కోర్సు గ్రామీణ ప్రాంత ఐ.ఎం.ఏ వైద్యులకు, వివిధ స్పెషాలిటీ వైద్యులకు ఎంతగానో ఉపయోగ పడుతుందన్నారు. మధుమేహం శరీరంలోని ప్రతి ఒక్క అవయవంపై ప్రభావం చూపుతుందని, అందువల్ల అన్ని స్పెషాలిటీ విభాగాల వైద్యులు, సాధారణ వైద్యులు మధుమేహంపై అత్యాధునిక చికిత్స పద్ధతులు తెలుసు కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తద్వారా మధుమేహ బాధితులకు మెరుగైన వైద్యం అందించే అవకాశం ఏర్పడుతుందని అన్నారు. ఆ లక్ష్యంతోనే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ, ఐ.ఎం.ఏ. కాలేజ్ ఆఫ్ జనరల్ ప్రాక్టీషనర్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ ఈ కోర్సును రూపకల్పన చేయడం జరిగిందని తెలిపారు. ఈ కోర్సు నిర్వహణకు కన్వీనర్ గా పిడుగురాళ్ల ఐ.ఎం.ఏ శాఖ అధ్యక్షులు డాక్టర్ ధూళిపాళ్ల భరత్ కుమార్ ను నియమించడం జరిగిందని చెప్పారు. కోర్సు శిక్షణా తరగతులకు ప్రముఖ ఫిజీషియన్ సిద్ధార్థ వైద్య కళాశాల జనరల్ మెడిసిన్ విభాగం పూర్వ విభాగాతిపతి సిద్ధార్థ వైద్య కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ గంటి ఈశ్వర్ సారధ్యం వహిస్తారని అన్నారు. ఈ సందర్భంగా కోర్సు బ్రోచరును ఆవిష్కరించారు. నవంబర్ నెలలో ప్రారంభమయ్యే కోర్సులో తొలి బ్యాచ్ లో 50 మందికి మాత్రమే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సిజిపి కార్యదర్శి డాక్టర్ ఎం.వి.వి. మురళీమోహన్, డైరెక్టర్ డాక్టర్ ఎం.ఫర్ని కుమార్, కోర్సు నిర్వాహకులు ప్రొఫెసర్ జి.ఈశ్వర్, కన్వీనర్ డాక్టర్ ధూళిపాళ్ల భరత్ కుమార్, సంయుక్త కార్యదర్శి డాక్టర్ టి.సేవ కుమార్, విజయవాడ ఐ.ఎం.ఏ శాఖ అధ్యక్షులు డాక్టర్ బోడేపూడి హనుమయ్య తదితరులు పాల్గొన్నారు.

– “అక్షర ఉదయమ్” న్యూస్
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..