ఉగాదికి మరో 5 లక్షల ఇళ్లు పూర్తి

ఉగాదికి మరో 5 లక్షల ఇళ్లు పూర్తి

 

అక్షర ఉదయమ్ – అమరావతి

 

 

అర్హులైన పేదలకు ఇళ్ల కలని సాకారం చేసేందుకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతోంది. ఇప్పటికే 3 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి కాగా, వచ్చే ఉగాది నాటికి మరో 5 లక్షల గృహాలు పూర్తి చేసే లక్ష్యాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించారు.

 

సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో సీఎం మాట్లాడుతూ, ప్రతి మూడు నెలలకు ఒకసారి గడువులు నిర్ణయించి లక్ష్య సాధన దిశగా అధికారులు ముందుకు సాగాలని సూచించారు. పేదలకు పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇళ్ల నిర్మాణానికి ఇవ్వాలనే ప్రభుత్వ విధానాన్ని మరోసారి స్పష్టం చేశారు.

 

నివాసయోగ్యమైన ప్రదేశాల దూరంలో గత ప్రభుత్వంలో లభించిన లేఅవుట్లలో స్థలాలు తీసుకున్న లబ్ధిదారులు అక్కడ నిర్మాణం చేయడానికి ముందుకు రాకపోతే ఆ కేటాయింపులను రద్దు చేస్తామని, బదులుగా నివాసయోగ్య ప్రాంతాల్లో కొత్తగా 2 లేదా 3 సెంట్లు కేటాయిస్తామని సీఎం ప్రకటించారు. అదే సమయంలో, ఇప్పటికే ఇచ్చిన స్థలంలోనే నిర్మించాలనుకుంటే అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు.

 

పట్టణాల్లో స్థల ధరలు అధికంగా ఉన్నచో జీ+3 మోడల్‌లో ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు చంద్రబాబు వివరించారు. ఐదేళ్లలో అర్హులైన ప్రతి ఒక్కరికీ స్థలం ఇచ్చి ఇళ్లు నిర్మించి ఇవ్వడం ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు.

 

తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్‌రెడ్డి సదస్సులో మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో కొంతమంది లబ్ధిదారులకు వారి నియోజకవర్గం కాకుండా ఇతర ప్రాంతాల్లో స్థలాలు కేటాయించడంతో వారు నిర్మాణం ప్రారంభించలేదని సూచించగా, దానిపై సీఎం స్పందించి అధికారులకు దిశానిర్దేశం ఇచ్చారు.