“మన బడి – మన బాధ్యత”

“మన బడి – మన బాధ్యత”

 

 

అక్షర ఉదయమ్ – గుంటూరు

 

పాఠశాల విద్యా ప్రమాణాలు మెరుగుపరచడమే లక్ష్యంగా గుంటూరు జిల్లా యంత్రాంగం వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. తొమ్మిదో, పదో తరగతి విద్యార్థుల్లో చదువుపట్ల ఆసక్తి పెంపు, ఉన్నత విద్య మరియు ఉద్యోగ అవకాశాల పట్ల అవగాహన కల్పించడం ద్వారా పదో తరగతి పరీక్షల్లో శత శాతం ఫలితాలు సాధించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యం.

ఈ మేరకు జిల్లాలోని 185 ఉన్నత పాఠశాలలకు జిల్లా స్థాయి అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమిస్తూ పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించినట్లు జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా ఉత్తర్వులు జారీ చేశారు.

తొమ్మిదీ, పది తరగతుల విద్యార్థుల్లో మానసిక ఆందోళన తగ్గించడం, చదువుపట్ల ఏకాగ్రత పెంచడం, వెనుకబడిన సబ్జెక్టులను గుర్తించి తర్ఫీదు ఇవ్వడం, విద్యార్థులో ఉన్న భయం నివారించడం వంటి అంశాలపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు.

విద్యార్థులకు మార్గదర్శకత్వం, కౌన్సిలింగ్, ఉత్తమ ప్రతిభ కనబరిచిన వ్యక్తుల జీవిత చరిత్రల ద్వారా ప్రేరణ కలిగించడం వంటి కార్యక్రమాలు ఇందులో భాగమని అధికారులు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ – “విద్యార్థులు సరైన అవగాహన లేక అనేక అవకాశాలు చేజార్చుకుంటున్నారు. వారికి సరైన దిశలో మార్గనిర్దేశం చేస్తే భవిష్యత్తుకు గట్టి పునాది పడుతుంది. అందుకే ‘మన బడి – మన బాధ్యత’ కార్యక్రమాన్ని ప్రారంభించి, జిల్లా అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించాం” అన్నారు.

తమ స్వీయ అనుభవాలు, కార్యనుభవం ద్వారా విద్యార్థులకు మార్గదర్శనం ఇవ్వడం ద్వారా ఆత్మవిశ్వాసం పెంచి, మానసిక స్థైర్యం కలిగించడంలో ఈ కార్యక్రమం సహాయపడుతుందనే నమ్మకం కలెక్టర్ వ్యక్తం చేశారు.