జర్నలిస్టుల హౌసింగ్ స్కీంపై సీఆర్డీఏకు తగిన ఆదేశాలు
- మంత్రి వర్గ ఉపసంఘం ముందుకూ ప్రతిపాదన
- మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్
- అక్షర ఉదయమ్ – అమరావతి
అమరావతి జర్నలిస్టుల హౌసింగ్ స్కీమ్‌పై ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. దీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ అంశంపై సానుకూలంగా స్పందించిన మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ప్రభుత్వం తరపున వెంటనే సీఆర్‌డీఏ కమిషనర్‌కు తగిన ఆదేశాలు జారీ చేస్తామని తెలిపారు. అంతే కాకుండా జర్నలిస్టుల హౌసింగ్ స్కీమ్‌కు సంబంధించిన అంశాన్ని ప్రభుత్వంలో సంబంధిత మంత్రివర్గ ఉప సంఘం ముందుంచి తదుపరి చర్యలకు మార్గం సుగమం చేస్తామని స్పష్టం చేశారు.
వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో అమరావతి జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ ప్రతినిధులు సోమవారం సురేష్ కుమార్‌ను కలిసి, సుప్రీంకోర్టు మాజీ రిజిస్ట్రార్ జనరల్ నుంచి పొందిన న్యాయ నిపుణుల అభిప్రాయాన్ని సమర్పించారు. జర్నలిస్టుల హౌసింగ్ స్కీమ్‌కు సంబంధించిన న్యాయ పరమైన, విధాన పరమైన అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సుప్రీంకోర్టు మాజీ రిజిస్ట్రార్ జనరల్ ఇచ్చిన లీగల్ ఒపీనియన్‌ను అనుసరించి సొసైటీ సభ్యులకు గృహ నిర్మాణం చేపట్టేందుకు ఎలాంటి న్యాయపరమైన అడ్డంకులు లేవని వివరించారు.
సొసైటీ ప్రతినిధుల వాదనలను సావధానంగా విన్న ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ సానుకూలంగా స్పందించారు. ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం నుంచి అవసరమైన చర్యలు తీసుకుంటామని, సీఆర్‌డీఏ కమిషనర్‌కు వెంటనే ఈ విషయంపై మెమో పంపిస్తామని తెలిపారు. అనంతరం హౌసింగ్ స్కీమ్‌కు సంబంధించిన ప్రతిపాదనను మంత్రివర్గ ఉప సంఘం ముందుంచి, ప్రభుత్వ స్థాయిలో అవసరమైన నిర్ణయాలు తీసుకునేలా చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ప్రభుత్వం గతంలో జారీ చేసిన జిఓ ఎంఎస్ నంబర్ 107 విధి, విధానాలను స్పష్టం చేసిందని, దాని అమలుకు సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు.
మరోవైపు ఐ అండ్ పీఆర్ కమిషనర్ విశ్వనాథన్ ను సైతం సంఘం ప్రతినిధులు కలిశారు. అమరావతి రాజధాని నిర్మాణంతో పాటు జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించిన పెండింగ్ అంశాలను కూడా పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఈ సందర్భంగా విశ్వనాథన్ తెలిపారు. జర్నలిస్టుల హౌసింగ్ స్కీమ్‌పై సొసైటీ సమర్పించిన న్యాయ పరమైన అభిప్రాయం స్పష్టంగా ఉందని, సంబంధిత శాఖలు, అధికారులతో సమన్వయం చేసుకుని ముందుకు వెళ్తామని చెప్పారు. లీగల్ ఒపీనియన్ పరంగా పరిశీలించినప్పుడు అమరావతిలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల రీత్యా గతంలో ప్రభుత్వం ఇచ్చిన జిఓ అమలుకు ఎటువంటి అడ్డంకి లేదని తెలిపారు.
సుదీర్ఘ కాలంగా పరిష్కారం కోసం ఎదురు చూస్తున్న జర్నలిస్టుల హౌసింగ్ స్కీమ్‌పై ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, ఐ అండ్ పీఆర్ కమిషనర్ విశ్వనాథన్ స్పష్టమైన హామీ ఇవ్వడంపై సొసైటీ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి సీఆర్‌డీఏ కమిషనర్‌కు మెమో పంపడం, అనంతరం మంత్రి వర్గ ఉప సంఘం ముందుకు అంశాన్ని తీసుకెళ్లే ప్రక్రియ ప్రారంభం కానుండటంతో ఈ స్కీమ్‌కు త్వరలోనే పరిష్కారం లభిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో అమరావతి జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ ప్రధాన కార్యదర్శి పాటిబండ్ల నాగ శ్రీనివాస్, వ్యవస్థాపక కార్యదర్శి చావా రవి, ది పయనీర్ చీఫ్ ఆఫ్ బ్యూరో డాక్టర్ రవి కుమార్ బొప్పన, ది హిందూ డిప్యూటీ ఎడిటర్ శ్రీనాథ్, ఆంధ్రప్రభ చీఫ్ ఆఫ్ బ్యూరో నేరెళ్లకుంట గోపి పాల్గొన్నారు.