అక్షర ఉదయమ్
Date of Publish : 24 February 2025, 12:23 am Posted by : అక్షర ఉదయమ్

ఐదు జిల్లాల మీదుగా అమరావతి ఔటర్ రింగ్ రోడ్

అక్షర ఉదయమ్ – అమరావతి

 

గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం రాజధాని నగరంతో పాటు ఔటర్ రింగ్ రోడ్ కూడా సమాంతరంగా నిర్మించేందుకు అవసరమైన పనులన్నీ ఆదివారం చక చకా సాగుతున్నాయి. ఓఆర్ఆర్ వెళ్లే ఐదు జిల్లాల్లో భూసేకరణకు ప్రభుత్వం అధికారులను నియమించింది. 23 మండలాలు, 121 గ్రామాల
మీదుగా 189. 9 కిలోమీటర్ల మేర ఈ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం కానుంది. ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, ఏలూరు జిల్లాల్లో ఈ ఔటర్ రింగ్ రోడ్
ఉంటుంది.

రహదారులతో అనుసంధానం చేసే ఓఆర్‌ఆర్‌కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. తాజాగా ఔటర్ రింగ్ రోడ్డుకు ఆమోదం తెలుపుతూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ క్రమంలో 189.9కిమీ మేర అలైన్‌మెంట్‌కు ఓకే చెప్పింది. ఐదు జిల్లాల (ఎన్టీఆర్, ఏలూరు, కృష్ణా, గుంటూరు, పల్నాడు) పరిధిలోని 23 మండలాలు, 121 గ్రామాల మీదుగా రోడ్డు నిర్మాణం జరగనుంది. త్వరలోనే భూసేకరణకు నోటిఫికేషన్ ఇవ్వనుంది. ఔటర్ రింగ్ రోడ్డులో 2 బ్రిడ్జిలు, 78 అండర్ పాస్‌లు, 65 వంతెనలు నిర్మిస్తారు.

ఈ క్రమంలో విజయవాడ తూర్పు బైపాస్ అవసరం లేదని తేల్చి చెప్పింది. దానికి ప్రత్యామ్నాయంగా రెండు లింక్ రోడ్ల నిర్మాణానికి అవకాశం కల్పిస్తూ నిర్ణయించింది. చెన్నై-కోల్‌కత్త జాతీయ రహదారిలో విజయవాడ బైపాస్ మొదలయ్యే కాజ నుంచి తెనాలి సమీపంలోని నందివెలుగు వరకు 17కి.మీ మేర ఆరు వరుసల అనుసంధాన రహదారిని నిర్మించనున్నారు. దీని కోసం మూడు ఎలైన్‌మెంట్లను NHAI సిద్ధం చేసి, రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. గుంటూరు బైపాస్‌లో బుడంపాడు నుంచి నారాకోడూరు వద్ద ఓఅర్ఆర్ వరకు నాలుగు వరుసలుగా రహదారిని విస్తరిస్తారు.