బీటెక్ చదివి బెట్టింగ్‌లకు బానిసై దొంగగా మారిన అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్‌

బీటెక్ చదివి బెట్టింగ్‌లకు బానిసై దొంగగా మారిన అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్‌

 

  • పది రోజుల్లోలోనే నాలుగు వరుస దొంగతనాలను చేధించిన కొల్లిపర పోలీసులు
  • 16 లక్షల విలువైన ఆభరణాలు రికవరీ

 

అక్షర ఉదయమ్ – గుంటూరు

 

గుంటూరు జిల్లా కొల్లిపర పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఒక దొంగతన ఘటనను పది రోజుల్లోనే చేధించి 16 లక్షల రూపాయల విలువైన బంగారం, వెండి ఆభరణాలను రికవరీ చేసిన కొల్లిపర పోలీసులు. బెట్టింగ్‌లకు బానిసై వరుస దొంగతనాలకు పాల్పడిన అంతర్రాష్ట్ర నిందితుడు పెనుగొండ మల్లికార్జున రెడ్డి @ మల్లి (23)ని పోలీసులు అరెస్ట్ చేశారు.

బీటెక్ డిగ్రీ పూర్తి చేసిన నిందితుడు, ఉద్యోగ ప్రయత్నంలో విఫలమవడంతో ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌లకు బానిస
య్యాడు. అప్పుల్లో కూరుకుపోయిన తరువాత డబ్బులు సంపాదించేందుకు దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. తాళం వేసిన ఇళ్ళను లక్ష్యంగా ఎంచుకుని, తాళాలు పగలగొట్టి బంగారం, వెండి వస్తువులను దొంగిలించేవాడు.

నిందితుడు కొల్లిపర, తెనాలి రూరల్, మేడికొండూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో నాలుగు దొంగతనాలు చేసినట్లు విచారణలో వెల్లడయింది. ఈ దొంగతనాల్లో మొత్తం 96 గ్రాముల బంగారం, 500 గ్రాముల వెండి ఆభరణాలు, ₹5,000 నగదు రికవరీ చేయబడ్డాయి.

మున్నంగి గ్రామంలో జరిగిన దొంగతనం కేసులో కొల్లిపర ఎస్సై ఎస్‌.వి. ప్రసాద్ నేతృత్వంలోని బృందం సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించి, బైక్‌పై ముసుగుతో తిరుగుతున్న వ్యక్తి ఆధారంగా నిందితుడిని గుర్తించారు. తెనాలి రూరల్ సీఐ ఎస్‌కే నాయబ్ రసూల్, తెనాలి డీఎస్పీ బి. జనార్ధనరావు పర్యవేక్షణలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి, డిసెంబర్ 30న నిందితుడిని అరెస్ట్ చేశారు.

నిందితుడిపై ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని హుజూర్‌నగర్, చింతకాని, అనంతగిరి పోలీస్ స్టేషన్ల పరిధిలో మూడు దొంగతనాల కేసులు నమోదు అయ్యాయి, వీటిలో ఒక కేసులో జైలుశిక్ష అనుభవించాడు.

జిల్లా ఎస్పీ పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో మీడియాతో మాట్లాడుతూ ప్రజలు తమ ఇళ్లకు తాళాలు వేసి బయటకు వెళ్ళే ముందు స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఇంటి చుట్టుపక్కల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం, LHMS సేవలను వినియోగించుకోవడం ద్వారా భద్రతా చర్యలు పాటించాలని సూచించారు.

వరుస దొంగతనాల కేసులను చేధించి నిందితుడిని తక్షణమే పట్టుకుని, చోరీ సొత్తు మొత్తాన్ని రికవరీ చేసిన తెనాలి డీఎస్పీ బి. జనార్ధనరావు, తెనాలి రూరల్ సీఐ ఎస్‌కే నాయబ్ రసూల్, కొల్లిపర ఎస్సై ఎస్‌.వి. ప్రసాద్, ఏఎస్సై పోతురాజు, హెచ్‌సీ రామకోటేశ్వరరావు, కానిస్టేబుళ్లు కూర్మారావు, పోతురాజువులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి ప్రశంసా పత్రాలను అందజేశారు.