వాతావరణం, నీటినిర్వహణ సూచికల కోసం అవేర్ 2.0

వాతావరణం, నీటినిర్వహణ సూచికల కోసం అవేర్ 2.0

 

  • వర్షాలు, తుపాన్లపై 7 రోజుల ముందుగానే హెచ్చరికలు
  • విపత్తు నిర్వహణలో కీలకంగా అవేర్ 2.0 వ్యవస్థ
  • ప్రాణ, ఆస్తి నష్టాల నివారణలో ప్రధాన భూమిక
  • నదులు, జలాశయాల్లో నీటి నిల్వలపైనా నిరంతర పర్యవేక్షణ
  • వ్యవసాయం, మత్స్యకారులు సహా 42 రంగాల్లో అవేర్ సేవలు
  • సీఎం చంద్రబాబు ఆదేశాలతో అవేర్-2.0 డాష్ బోర్డు తెచ్చిన ఆర్టీజీఎస్

 

అక్షర ఉదయమ్ – అమరావతి

వాతావరణ ముందస్తు అంచనాలు, విపత్తు నిర్వహణ, నదులు, జలాశయాల్లో నీటి నిల్వలపై పర్యవేక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆధునిక టెక్నాలజీని వినియోగిస్తోంది. అవేర్ వ్యవస్థ ద్వారా రాష్ట్రంలోని వివిధ అంశాల్లో ముందస్తు సమాచారాన్ని ప్రజలకు అందిస్తున్న ప్రభుత్వం మరిన్ని రంగాలను కూడా ఈ వ్యవస్థకిందకు తీసుకువస్తూ నిర్ణయం తీసుకుంది. వాతావరణంతో పాటు రాష్ట్రంలోని నదులు, జలాశయాల్లో నీటి నిల్వలు, సాయిల్ మాయిశ్చర్, గాలి నాణ్యత, కాలుష్యం, భూగర్భ జలాలు ఇలా వేర్వేరు అంశాలను పర్యవేక్షించేలా, ప్రజలకు వేగంగా సమాచారాన్ని అందించేలా అవేర్ 2.0ను రూపోందించింది. భారీ వర్షాలు, పిడుగులు, తుపాన్లు, తీవ్రస్థాయి ఉష్ణోగ్రతలు లాంటి వాతావరణ అంశాలపై ముందస్తు సమాచారాన్ని సేకరించి అప్రమత్తం చేయటం ద్వారా ప్రజల ప్రాణాలను, ఆస్తిని కాపాడేలా వ్యవస్థ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ మేరకు ఏపీ వెదర్ ఫోర్ కాస్టింగ్ అండ్ ఎర్లీ వార్నింగ్ రీసెర్చ్ సెంటర్-అవేర్ 2.0 వ్యవస్థను ఆర్టీజీఎస్ ఏర్పాటు చేసింది. ఈ వ్యవస్థ ద్వారా వర్షాలు, వరదలు, పిడుగులు, గాలివానలు, జలాశయాల నీటి స్థాయిలు, నదుల ప్రవాహాలపై ముందస్తు అంచనాలు ఇచ్చి విపత్తు నిర్వహణలో కీలక సమాచారాన్ని ముందుగానే అందుబాటులోకి రానుంది. వాతావరణంలో వచ్చే మార్పులను 7 రోజుల ముందుగానే అవేర్-2.0 వ్యవస్థ పసిగట్టి హెచ్చరికలు జారీ చేయనుంది. ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమై ప్రజల ప్రాణాల్ని, ఆస్తుల్ని, మూగజీవాలను కాపాడేందుకు ఆస్కారం ఏర్పడింది. ఆవేర్ 2.0 తో ప్రకృతి విపత్తుల వల్ల కలిగే ప్రాణ, ఆస్తి నష్టాలను చాలా వరకు తగ్గించే అవకాశం కలుగుతుందని ఆర్టీజీఎస్ చెబుతోంది. కొత్త వ్యవస్థతో పూర్తిగా మరణాలను నివారించేందుకు ఆస్కారం ఏర్పడిందని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.

రైతులకు, మత్స్యకారులకు మేలు జరిగేలా

అవేర్ 2.0 ద్వారా వారం రోజుల ముందుగానే వర్షపాతం, గాలి వేగం, మెరుపులు, పిడుగుపాటుపై ఖచ్చితమైన అంచనాలు లభిస్తున్నాయని ఆర్టీజీఎస్ వెల్లడించింది. ఈ సమాచారం ఆధారంగా రైతులు పంటల నిర్వహణ, మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లకుండా ముందస్తుగా హెచ్చరికలు జారీ చేయొచ్చని అధికారులు చెబుతున్నారు. తుపాన్లకు సంబంధించి ముందస్తు సమాచారం లేకపోవటంతో మత్స్యకారులు సముద్రంలో చిక్కుకుంటున్న పరిస్థితులు నెలకొంటున్నాయని ఈ కారణంగా వారి విలువైన ప్రాణాలు కోల్పోవటం లేదా పొరుగుదేశాల సరిహద్దుల్లోకి వెళ్తున్న ఘటనలు నమోదు అవుతున్నట్టు ఆర్టీజీఎస్ తెలిపింది. ప్రస్తుతం అవేర్ –2.0 వ్యవస్థతో సముద్రంలో జరిగే ప్రమాదాలను నివారించవచ్చని స్పష్టం చేసింది. మరోవైపు రాష్ట్రంలోని 109 జలాశయాలు, కృష్ణా–గోదావరి వంటి ప్రధాన నదులపై రియల్ టైమ్ మానిటరింగ్ ను కూడా చేస్తున్నట్టు ఆర్టీజీఎస్ తెలిపింది. రిజర్వాయర్లలో నీటి నిల్వలు, ప్రవాహాలపై కూడా అవేర్ తో తక్షణం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

ముందస్తు చర్యలతో ప్రజల రక్షణ

ప్రకాశం బ్యారేజ్, పోలవరం, శ్రీశైలం వంటి కీలక ప్రాజెక్టులు, నదీ పరివాహక ప్రాంతాల్లో వరద ప్రవాహాల అంచనాలను ముందస్తుగానే తెలుసుకుని ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఆవేర్ ఆస్కారం కల్పించనుంది. ఈ వ్యవస్థ ద్వారా వ్యవసాయం, మత్స్యకారులు, రవాణా, విద్యుత్, జలవనరులు వంటి 42 విభాగాలకు సేవలు అందనున్నాయి. అలాగే వ్యవసాయానికి సంబంధించి భూగర్భజలాల లభ్యతతో పాటు మండల, జిల్లాల వారీగా పంటలకు వచ్చే తెగుళ్లు లాంటి అంశాల్లోనూ హెచ్చరికలు జారీ చేసేందుకు అవేర్ వ్యవస్థ ఉపయోగపడనుంది. మరోవైపు సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు కూడా ఏ ప్రాంతాల్లో చేపలు ఎక్కువగా లభ్యం అవుతాయన్న అంశాన్ని కూడా ఉపగ్రహ ఛాయాచిత్రాల ఆధారంగా అవేర్ అందిస్తుందని ఆర్టీజీఎస్ స్పష్టం చేసింది. ఈ సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచేలా రాష్ట్ర ప్రభుత్వం ఓ డ్యాష్ బోర్డును ఏర్పాటు చేసింది. aware.ap.gov.in వెబ్ సైట్ లో వాతావరణ సూచనలు, జలాశయాల స్థితి, నదుల ప్రవాహాలపై లైవ్ డేటా చూసేందుకు ఆస్కారం ఏర్పడనుందని ఆర్టీజీఎస్ స్పష్టం చేసింది.

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..

www.aksharaudayam.in