ప్రమాద ఘటన స్థలాన్ని పరిశీలించిన బాపట్ల జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్
అక్షర ఉదయమ్ – బాపట్ల
బాపట్ల జిల్లా కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ప్రమాద ఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ స్వయంగా పరిశీలించారు.
శుక్రవారం మధ్యాహ్నం సుమారు 1:30 గంటల సమయంలో భట్టిప్రోలు మండలం చింతమోటు గ్రామానికి చెందిన పలువురు వ్యక్తులు, కొల్లూరు మండలంలోని లంక గ్రామాల నుండి కొబ్బరికాయలను టాటా ఏసీ ట్రక్‌లో చెరుకుపల్లికి తరలిస్తుండగా, ధోనేపూడి–కోటిపల్లి గ్రామాల మధ్య వాహనం అదుపు తప్పి పక్కనే ఉన్న కాలువలో బోల్తాపడింది.
ప్రమాదంలో వాహనం పైన ప్రయాణిస్తోన్న చింతమోటు గ్రామానికి చెందిన ఛత్రగడ్డ కాంతారావు (50), పెసర్లంకకు చెందిన శ్రీనివాసరావు (55), వెల్లటూరుకు చెందిన షేక్ ఇస్మాయిల్ (60) అనే ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మిగతా ముగ్గురికి గాయాలయ్యాయని, వారిని పోలీసులు తక్షణమే తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని ఎస్పీ తెలిపారు.
ప్రమాదం జరిగిన వెంటనే జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఘటనాస్థలాన్ని సందర్శించి, దర్యాప్తు పురోగతిని పరిశీలించారు. ప్రమాదానికి దారితీసిన కారణాలను తెలుసుకొని, ఇటువంటి సంఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులకు సూచనలు ఇచ్చారు.
రోడ్డు ప్రమాదాల్లో ప్రాణనష్టం చాలా బాధాకరమని వ్యాఖ్యానించిన ఎస్పీ గారు, “హైవేలపై రహదారి భద్రతను బలోపేతం చేసేందుకు జిల్లాలో 9 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశాం. వీటి ద్వారా రహదారి భద్రత చర్యలు క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తున్నాం” అని తెలిపారు. ప్రజల్లో రహదారి భద్రతపై అవగాహన పెంపు పోలీసు శాఖ ముఖ్య ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు.
ఈ సందర్శనలో ఎస్బీ ఇన్స్పెక్టర్ జి. నారాయణ, వేమూరు సీఐ పి.వి. ఆంజనేయులు, భట్టిప్రోలు ఎస్‌ఐ ఎం. శివయ్య, మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.