
అక్షర ఉదయమ్ – పిడుగురాళ్ళ :
వైద్యురాలిగా రోగుల నాడి పట్టి వైద్యం చేసే వున్నం దీపిక.. ఇప్పుడు రాజకీయ నాయకురాలిగా ఓటర్ల నాడి పట్టడంలో విజయం సాధించారు. పల్నాడు జిల్లా పరిషత్ తొలి ఛైర్మన్ పీఠాన్ని దక్కించుకోవాలనే కృత నిశ్చయంతో.. ప్రముఖ వైద్యునిగా పేరుగాంచి, తల్లిదండ్రుల అడుగు జాడల్లో తనదైన శైలిలో రాజకీయాలు చేస్తున్న భర్త వున్నం నాగ మల్లిఖార్జునరావు సహకారంతో పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ జెడ్పీటీసీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు. రాజకీయ అరంగేట్రంతోనే మూడు దశాబ్దాల తమ కుటుంబ రాజకీయ ప్రస్థానాన్ని గుర్తు చేస్తూ ఓటర్ల మన్ననలు చూరగొంటున్నారు వున్నం దీపిక.

రాజకీయాల్లో మూడు దశాబ్దాల క్రితమే వున్నం దీపిక అత్త వున్నం శేషారత్నం నరసింహారావు చక్రం తిప్పారు. 1995లో అప్పటి గురజాల శాసన సభ్యులు యరపతినేని శ్రీనివాసరావు ప్రోద్బలంతో తెలుగుదేశం పార్టీ తరపున బరిలోకి దిగి విజయ బావుటా ఎగురవేసి 1995 – 2000 వరకు ఎంపీపీగా మండల అభివృద్ధి పరుగులు పెట్టించారు. సుమారు మూడు దశాబ్దాల తర్వాత తిరిగి అత్త బాటలో ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలిచారు కోడలు వున్నం దీపిక.
ఊహించని విధంగా ఎన్నికల బరిలో దిగి, ఎన్నికలకు అతి తక్కువ సమయం ఉన్నప్పటికీ.. భర్త వున్నం నాగ మల్లిఖార్జునరావు తోడుగా ఎన్నికల ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. భార్యా భర్తలు ఇరువురు వైద్యులుగా అందరికీ సుపరిచితులు కావడం.. రాజకీయంగా మూడు దశాబ్దాల నుంచి సేవలు అందిస్తుడడంతో వీరికి ఓటర్ల నుంచి ప్రచారంలో అనూహ్య స్పందన లభిస్తోంది.
వీరికి అండదండలుగా నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, గురజాల శాసన సభ్యులు యరపతినేని శ్రీనివాసరావు, ఆయన తనయుడు యువ నాయకులు యరపతినేని నిఖిల్ పిడుగురాళ్ళ మండలంలో ప్రచారం హోరెత్తిస్తున్నారు.

వున్నం దీపిక అత్త, మామ వున్నాం శేషారత్నం, నరసింహారావు సైతం కోడలి గెలుపు కోసం తమ రాజకీయ చాతుర్యం ప్రదర్శిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు.
పిడుగురాళ్ళ జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారంలో వైద్యురాలు “దీపిక వున్నం” దూసుకు పోతున్న తీరును గమనిస్తున్న “ఓటరు గణం” ఈ నెల 5వ తేదీన జరుగనున్న ఎన్నికల్లో గెలుపు ఆమెదే అంటూ ఆశీర్వదిస్తున్నారు.