ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా సండే ఆన్ సైకిల్ ర్యాలీని ఘనంగా ప్రారంభించిన జిల్లా ఎస్పీ తుషార్ డూడి

అక్షర ఉదయమ్ – బాపట్ల
- ఉత్సాహంగా పాల్గొన్న పోలీస్ అధికారులు, సిబ్బంది
- సైక్లింగ్ వలన మానసిక ప్రశాంతత చేకూరి శారీరక రుగ్మతలు అదుపులో ఉంటాయి
- సైక్లింగ్ అనేది పర్యావరణ హితమైనది.
- – జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపీఎస్
సైక్లింగ్ అనేది పర్యావరణ హితమైనదిగా ఉండటంతో పాటు, మానసిక ఒత్తిడిని నియంత్రించడంలో, శారీరక దృఢత్వాన్ని మరియు వ్యక్తిగత ఆరోగ్యాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపీఎస్ తెలిపారు. ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా పర్యావరణ పరిరక్షణ, వ్యక్తిగత ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడం, మరియు కాలుష్య నివారణపై ప్రజల్లో చైతన్యం పెంపొందించేందుకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీను నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీని జిల్లా ఎస్పీ జెండా ఊపి ప్రారంభించి స్వయంగా పాల్గొన్నారు. ఆదివారం ఉదయం బాపట్ల పట్టణంలోని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ సైకిల్ ర్యాలీ కలెక్టర్ కార్యాలయం, చీలిరోడ్డు, మున్సిపల్ కార్యాలయం, పాత బస్టాండ్, గడియార స్థంభం సెంటర్, అంబేద్కర్ విగ్రహం వరకు సాగి, మళ్లీ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయానికి చేరుకుంది. అనంతరం పోలీస్ అధికారులు మరియు సిబ్బంది యోగాసనాలు చేసి ఆరోగ్యాన్ని మెరుగుపర్చే ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా “Sundays on Cycle” (సండేస్ ఆన్ సైకిల్) కార్యక్రమాన్ని బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం నుండి ఘనంగా ప్రారంభించామన్నారు. ప్రకృతితో స్నేహపూర్వకంగా ఉండే జీవనశైలి (ఎకో ఫ్రెండ్లీ) పట్ల ప్రజల్లో చైతన్యం కల్పించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ప్రతి రోజు సైక్లింగ్ చేయడం వలన ఆరోగ్యానికి మేలు చేసేందుకు తోడ్పడుతోందని, పర్యావరణాన్ని రక్షించడంలో కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుందన్నారు. గుండె సంబంధిత రోగాల నివారణ, మధుమేహ నియంత్రణ, ఒత్తిడిని తగ్గించడం, శరీర బరువు నియంత్రణ వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలు సైక్లింగ్ ద్వారా పొందవచ్చని వివరించారు. పోలీస్ ఉద్యోగం నిత్యం ఒత్తిడితో కూడుకున్నదనీ, అలాంటి పనిలో ఆరోగ్యంగా ఉండేందుకు సైక్లింగ్ వంటి వ్యాయామాలు ఎంతో మేలు చేస్తాయని తెలిపారు. శారీరకంగా శక్తివంతంగా తయారయ్యేందుకు కూడా ఇది ఒక మంచి మార్గమని పేర్కొన్నారు. స్నేహితులు, బంధువులు, ఉద్యోగస్తులు సమూహాలుగా సైక్లింగ్ చేయటం వలన వారి మధ్య ఐక్యత, భావాలు, స్నేహ సంబంధాలు మరింత మెరుగవుతాయన్నారు. ప్రస్తుత సమాజంలో వాహనాల వాడకం పెరిగిన కొద్దీ వాయు కాలుష్యం, ధ్వని కాలుష్యం, వాతావరణ మార్పులు గణనీయంగా పెరిగిపోతున్నాయని, ఇవన్నీ మన ఆరోగ్యంపై మరియు భవిష్యత్ తరాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని వెల్లడించారు. ఈ పరిస్థితికి ప్రత్యామ్నాయంగా సైకిల్ వాడకాన్ని ప్రజల్లో ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతో ఉందని, సైక్లింగ్‌ను ఆరోగ్యకర అలవాటుగా ప్రజల్లో అలవరచేందుకు ప్రతి ఆదివారం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈ ర్యాలీలను నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ రోజు నిర్వహించిన ర్యాలీలో జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారని, రాబోయే రోజుల్లో ప్రజలు, ఇతర శాఖల ఉద్యోగులు, విద్యార్థులు తదితరులను భాగస్వాములుగా చేసుకొని మరింత విస్తృతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏఆర్ డిఎస్పి పి.విజయ సారథి, బాపట్ల డిఎస్పి జి.రామాంజనేయులు, సిసిఎస్ డిఎస్పి పి.జగదీష్ నాయక్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ నారాయణ, బాపట్ల టౌన్ సిఐ రాంబాబు, రూరల్ సిఐ శ్రీనివాసరావు, రూరల్ సర్కిల్ సిఐ హరికృష్ణ ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.






Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..