స్క్రబ్ టైఫస్ జ్వరాల పై ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం

అక్షర ఉదయమ్ – మంగళగిరి
రాష్ట్రవ్యాప్తంగా స్క్రబ్ టైఫస్ జ్వరాల నిర్ధారణ పరీక్షలను పీహెచ్సీ స్థాయిలోనే నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ తెలిపారు. ఇప్పటివరకు నమోదు అయిన తొమ్మిది మరణాలు స్క్రబ్ టైఫస్ వల్లేనంటూ తేల్చే ఆధారాలు లేవని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు 1,566 స్క్రబ్ టైఫస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. “ఈ మరణాలపై పూర్తి నిర్ధారణకు రెండు నుండి మూడు నెలల సమయం పట్టవచ్చని, ఇందుకోసం గుంటూరు, తిరుపతిలో జీనోమ్ స్వీకెన్సీ పరీక్షలు ప్రారంభించనున్నాం” అని వెల్లడించారు.
ఇతర రాష్ట్రాలతో పోల్చితే తక్కువ కేసులు
కమిషనర్ వివరాల ప్రకారం, 2025లో కర్ణాటకలో 1,870, తమిళనాడులో 7,308, తెలంగాణాలో 309 కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో మాత్రం 1,566 కేసులు మాత్రమే ఉన్నాయన్నారు. పరీక్షలు విస్తృతంగా నిర్వహించడం వల్లే కేసులు ముందు కంటే ఎక్కువగా బయటపడుతున్నాయని ఆయన చెప్పారు.
ఆర్ఆర్ టీంలు పరిశీలనలోకి
మంగళగిరిలోని కమిషనర్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధిక కేసులు లేదా అసాధారణ మరణాలు సంభవించిన ప్రాంతాలకు ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలు పంపిస్తున్నామన్నారు. ఆ ప్రాంతాల పరిసరాలను పరిశీలించి, నివారణ చర్యలపై సూచనలు ఇవ్వనున్నాయని వివరించారు. ప్రస్తుతం అన్ని బోధనా ఆసుపత్రులతో పాటు తెనాలి, హిందూపురం, పాడేరు, టెక్కలి జిల్లా ఆసుపత్రుల్లోనూ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయని తెలిపారు.
లక్షణాలు గుర్తిస్తే వెంటనే వైద్య సాయం
“శరీరంపై కీటకం కుట్టిన చోట నల్లటి మచ్చ కనిపించి, జ్వరం వస్తే వెంటనే పరీక్ష చేయించుకోవాలి” అని గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశస్వీ సూచించారు. గడిచిన 38 రోజుల్లో అక్కడ 26 స్క్రబ్ టైఫస్ కేసులు నమోదయ్యాయని, ముగ్గురు ఐసీయూలో ఉన్నారని తెలిపారు.
పాలన ప్రాంతాలైన పల్నాడు, బాపట్ల జిల్లాలకు ఇప్పటికే ఆర్ఆర్ టీంలు పంపినట్లు పేర్కొన్నారు. సాధారణంగా డాక్సిసైక్లిన్, అజిత్రోమైసిన్ మాత్రలతో ఈ జ్వరం పూర్తిగా నయం అవుతుందని ప్రజారోగ్య డైరెక్టర్ డాక్టర్ పద్మావతి తెలిపారు.
మరణాలపై తుది నిర్ధారణకు జీనోమ్ స్వీకెన్సీ అవసరం
“స్క్రబ్ టైఫస్ కారణంగా మరణాలు జరిగాయా అనే దానిని నిర్ధారించాలంటే జీనోమ్ స్వీకెన్సీ తప్ప మరొక మార్గం లేదు” అని ఇన్ఫెక్షియస్ డీసీజెస్ నిపుణుడు డాక్టర్ కల్యాణచక్రవర్తి తెలిపారు.
ఈ సమావేశంలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రఘునందన్, అదనపు సంచాలకులు డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరి, జాయింట్ డైరెక్టర్ మల్లీశ్వరి తదితరులు పాల్గొన్నారు.
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
Short News App: https://play.google.com/store/apps/details?id=com.aksharaudayam.app
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..
ఈ-పేపర్ కోసం www.epaper.aksharaudayam.in నీ సందర్శించండి.