వరద నీటిని వాటాగా లెక్కేస్తే నష్టపోతాం

వరద నీటిని వాటాగా లెక్కేస్తే నష్టపోతాం

 

జిల్లా ఇంచార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్

 

 


అక్షర ఉదయమ్ – నరసరావుపేట

వరదల సమయంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి వదిలిన నీటిని సైతం కృష్ణా జలాల్లో వినియోగించుకున్న నీటిగా లెక్కించడం వల్ల రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన నీటిని కోల్పోవాల్సి వస్తోందని జిల్లా ఇంచార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అభిప్రాయ పడ్డారు.

మంగళవారం స్థానిక కలెక్టరేట్ ఎస్సార్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన సాగునీటి సలహా మండలి సమావేశానికి మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ జీవి ఆంజనేయులు, జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా, ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, ఎమ్మెల్యేలు చదలవాడ అరవింద బాబు, జూలకంటి బ్రహ్మానందరెడ్డి, భాష్యం ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

సమావేశంలో ఆయన మాట్లాడుతూ సాగునీటిపై రైతుల నుంచి పన్నులు వసూలు చేసి కాల్వల నిర్వహణ మెరుగు పరచాలని అన్నారు. ఎత్తిపోతల పథకాలు మెరుగ్గా నిర్వహించేందుకు మొబైల్ లిఫ్ట్ పరికరాలు, నూతన ట్రాన్స్ ఫార్మర్లపై ప్రతిపాదనలు పంపాలన్నారు.

కాల్వల్లో సీపేజీ ద్వారా నీరు నష్టపోకుండా నివారించేందుకు డిజాస్టర్ మేనేజ్మెంట్ నిధులు వినియోగించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రూ.60 లక్షల వరకూ డిజాస్టర్ మేనేజ్మెంట్ నిధులు మంజూరు చేసే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా తెలిపారు.