జగన్ పాదయాత్ర ఏపీ ప్రతిష్ఠను దెబ్బ తీసేందుకే
- టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు యనమల తీవ్ర వ్యాఖ్యలు
అక్షర ఉదయమ్ – అమరావతి
స్థానిక సంస్థలు అంత ముఖ్యమైనవి కావని జగన్ భావించడం క్షేత్రస్థాయిలో ప్రజాస్వామ్య వ్యవస్థ మూలాలనే దెబ్బ తీసేలా ఉందంటూ టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. దీనివల్ల వైసీపీ అధినేత ప్రజాస్వామ్య వ్యతిరేక వైఖరి మరోసారి బయట పడిందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోతానని, తద్వారా తనకున్న అపఖ్యాతి మరింత పెరుగుతుందని భయపడే ఆ ఎన్నికలను ఎదుర్కోవడానికి వెనుకాడుతున్నారనే విషయం జగన్ తన వ్యాఖ్యల ద్వారా స్పష్టం చేస్తున్నారని అన్నారు.
బీసీలకు 34శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకుంటూ వైసీపీ నేతలు కోర్టులో కేసులు వేశారని యనమల అన్నారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లతో సహా బీసీల సంక్షేమం పట్ల జగన్ ఎప్పుడూ ఆసక్తి చూపలేదని విమర్శించారు. గత వైసీపీ హయాంలో రిజర్వేషన్ల శాతాన్ని 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గించినప్పుడు జగన్ మౌనంగా ఉండి పోయారని, దీని వల్ల బీసీలు 10శాతం రిజర్వేషన్లను కోల్పోయారని తెలిపారు. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేసి ప్రజలను మరోసారి మోసం చేయడం ద్వారా అధికారాన్ని దక్కించుకునేందుకే వచ్చే ఏడాది పాదయాత్ర చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ నిర్ణయించుకున్నారని విమర్శించారు. ఈ పాదయాత్ర రాష్ట్ర లేదా ప్రజల శ్రేయస్సు కోసం కాదని, కేవలం రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బ తీయడానికే ఉద్దేశించినదంటూ యనమల రామకృష్ణుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.