పిడుగురాళ్ళ ప్రభుత్వ వైద్య కళాశాలలో వచ్చే ఏడాది ఎంబిబియస్ ప్రవేశాలు
- మొదటి దశలో 100 సీట్లు
- బోధనాసుపత్రి సామర్ధ్యం పెంపు, సిబ్బంది నియామకానికి ముఖ్యమంత్రి ఆమోదం

అక్షర ఉదయమ్ – విజయవాడ
పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్య కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరంలో ఎంబిబియస్ ప్రవేశాలను కల్పించే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైద్యారోగ్య శాఖ చేసిన కొన్ని ప్రధాన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకం (సియస్‌యస్) కింద రాష్ట్ర ప్రభుత్వమే పిడుగురాళ్ళ కళాశాలను నిర్మించి, నిర్వహించనుంది. ఈ పథకం కింద కేంద్రం పిడుగురాళ్ళ కళాశాలకు రూ.195 కోట్ల సహాయాన్ని మంజూరు చేసి రాష్ట్రానికి విడుదల చేసింది.
మొదటి దశలో 100 ప్రవేశాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, సిబ్బంది నియామకాలకు సంబంధించిన ప్రతిపాదనలను ముఖ్యమంత్రి అంగీకరించారు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసి) ప్రస్తుత నిబంధనల మేరకు 100 ఎంబిబియస్ ప్రవేశాలకు 420 పడకలతో కూడిన బోధనాసుపత్రిని సమకూర్చాల్సి ఉంటుంది. గత ప్రభుత్వం 6 పడకల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 330 పడకల సామర్ధ్యం కలిగిన జిల్లా ఆసుపత్రిగా అభివృద్ధి చేసేందుకు అనుమతించింది. మారిన ఎన్ఎంసి నిబంధనల మేరకు 420 పడకల ఆసుపత్రి అవసరం కాగా ఈ దిశగా ఆసుపత్రిని విస్తరించేందుకు ముఖ్యమంత్రి అనుమతించారు.
పిడుగురాళ్ళ వైద్య కళాశాలకు 237 మంది వైద్యులు, ఇతర సిబ్బందితో పాటు బోధానాసుపత్రికి 600 మంది సిబ్బందిని సమకూర్చేందుకు కూడా ముఖ్యమంత్రి అంగీకరించారని వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
– తప్పుదోవ పట్టించిన గత ప్రభుత్వం
గత ప్రభుత్వం నిర్మించ దలచిన మొత్తం 17 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఒక్కో కాలేజీలో 150 ఎంబిబియస్ సీట్లు చొప్పున మొత్తం 2,500 ఎంబిబియస్ ప్రవేశాలకు ప్రణాళికలు రచించి, నిర్మాణాలు చేపట్టామని మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్‌రెడ్డి, అతని సహచరులు రాష్ట్ర ప్రజలను తప్పు దోవ పట్టించారని వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ ధ్వజమెత్తారు. జగన్ ప్రభుత్వం పిడుగురాళ్ళ ప్రభుత్వ వైద్య కళాశాలలో కేవలం 100 ప్రవేశాలకు మాత్రమే అనుమతిస్తూ ఆగస్టు 20, 2020న మెమో నంబరు 2980561 ని జారీ చేసిందని మంత్రి వెల్లడించారు. ఇదే రీతిన పాడేరు ప్రభుత్వ వైద్య కళాశాలలో కూడా జగన్ ప్రభుత్వం ఎన్ఎంసి నుండి 100 ఎంబిబియస్ ప్రవేశాలకు మాత్రమే అనుమతి పొందిందని మంత్రి తెలిపారు.
2023లో సవరించబడిన ఎన్ఎంసి నిబంధనల మేరకు ఎన్ఎంసికి దరఖాస్తు చేసుకునే నాటికే 150 ప్రవేశాలకు 620 పడకలతో కూడిన బోధానాసుపత్రి సిద్ధంగా ఉండాలని, మొదటి దశలో పిడుగురాళ్ళ వైద్య కళాశాలలో 100 ప్రవేశాలు కల్పించి అనంతరం అదనపు ప్రవేశాల కోసం చర్యలు చేపడతామని మంత్రి తెలిపారు.