అక్షర ఉదయమ్
Date of Publish : 09 September 2026, 6:32 pm Posted by : అక్షర ఉదయమ్

పాదయాత్ర 2.0 – మళ్ళీ జనంలోకి జగన్

2027లో పాదయాత్ర 2.O

వైసీపీ అధినేత జగన్ కీలక ప్రకటన

మల్లెంశెట్టి లక్ష్మణరావు

అక్షర ఉదయమ్ – ఎడిటర్

 


ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది నుంచి పాదయాత్ర చేయబోతున్నట్టు తెలిపారు. 2027 సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో పాదయాత్ర మొదలు పెడతానని జగన్ ప్రకటించారు. పర్చూరు కార్యకర్తల సమావేశంలో జగన్ ఈ ప్రకటన చేశారు.

2029లో జరగబోయే ఎన్నికలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నారు. ఈ మేరకు నియోజక వర్గాల వారీగా ఎమ్మెల్యేలు, నియోజక వర్గ సమన్వయ కర్తలతో ఆయన సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా పర్చూరు నియోజక వర్గ కార్యకర్తలతో సమావేశమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ పాదయాత్ర 2.0పై కీలక ప్రకటన చేశారు. త్వరలోనే పాదయాత్ర 2.0 ఉంటుందన్నారు.

వచ్చే ఏడాది అంటే 2027 సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో పాదయాత్రం 2.0ను రాష్ట్ర వ్యాప్తంగా చేపట్ట బోతున్నట్లు ఆయన పర్చూరు నియోజకవర్గ నేతల సమావేశంలో ప్రకటించారు. 2024 ఎన్నికల ఓటమి తర్వాత పార్టీని క్షేత్ర స్థాయి నుంచి పునర్నిర్మించే వ్యూహంలో భాగంగా ఈ యాత్ర రూపకల్పన ఉంటుందని అన్నారు. ఈ పాదయాత్ర ద్వారా ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకతను ఒడిసి పట్టి, ఎన్నికల మూడ్‌ను పార్టీకి అనుకూలంగా మార్చేందుకే ఈ పాదయాత్ర చేయనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఓ వైపు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో వైఫల్యాలు, పరిపాలనా లోపాలను ఎండ గడుతూనే, మరో వైపు తమ గత ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు గుర్తు చేయడం ప్రధాన ఎజెండాగా పాదయాత్రను సాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పాదయాత్రతో ఓటమితో నిరాశలో ఉన్న కార్యకర్తలు, నాయకుల్లో కొత్త ఉత్సాహం నింపాలని భావిస్తున్నారు. గతంలో చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు వచ్చిన పాజిటివ్‌ రెస్పాన్స్‌నే మళ్లీ తీసుకు రావాలని జగన్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం.