నీలం గుడ్డు పెట్టిన కోడి

నీలం గుడ్డు పెట్టిన కోడి

 

 

సాధారణంగా కోడిగుడ్లు తెల్లగా ఉంటాయి. ముదురు గోధుమ వర్ణంలో ఉండే కొన్ని రకాల గుడ్లను కూడా మార్కెట్లో చూస్తుంటాం. కానీ, కర్ణాటకలోని ఓ కోడి మాత్రం నీలం రంగు గుడ్డు పెట్టింది.

కర్ణాటక లోని దేవనగరి జిల్లా నల్లూరు గ్రామానికి చెందిన సయ్యద్ నూర్ కోళ్లను పెంచుతారు. ఆయన వద్ద 10 నాటుకోళ్లు ఉన్నాయి. అందులో ఓ కోడి ఇటీవల ఒక రోజు నీలం రంగులో గుడ్డు పెట్టింది. సాధారణ గుడ్డు కంటే భిన్నంగా ఉండటంతో సయ్యద్ దాన్ని చూసి తొలుత షాక్ అయ్యారు. ఆ తర్వాత దాన్ని భద్రంగా దాచిపెట్టారు. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల వాళ్లు ఆ నీలం రంగు గుడ్డును చూసేందుకు సయ్యద్ ఇంటికి పోటెత్తుతున్నారు.

ఆ నోటా, ఈ నోటా ఈ విషయం జంతు సంరక్షణ అధికారులకు చేరింది. దీంతో వారు వచ్చి కోడిని పరిశీలించారు. కొన్నిసార్లు కోళ్లు లేత ఆకుపచ్చ రంగులో గుడ్లను పెడుతుంటాయని, అయితే ఇలా నీలం రంగులో ఉండటం మాత్రం చాలా అరుదు అని వారు తెలిపారు. కోడి క్లోమంలో ఉండే బిలివర్డిన్ అనే వర్ణద్రవ్యం కారణంగా ఈ నీలం రంగు వచ్చి ఉండొచ్చని అభిప్రాయ పడుతున్నారు. కోళ్లలో జన్యుపరమైన సమస్యల వల్ల కొన్నిసార్లు ఇలా వింత రంగుల్లో గుడ్లు పెడుతుంటాయని, అయితే నాణ్యత, పోషక విలువల్లో సాధారణ గుడ్లకు, వీటికి ఏ తేడా ఉండదని జంతు సంరక్షణ అధికారులు వెల్లడించారు.

అయితే, ఇలాంటి గుడ్లు కొత్తేం కాదట. లాటిన్ అమెరికా దేశాల్లో పెరిగే కొన్నిరకాల జాతుల కోళ్లు ఇలా నీలం, ఆకుపచ్చ రంగుల్లో గుడ్లను పెడుతుంటాయని గతంలో వార్తలు వచ్చాయి. వాటిల్లో బిలివర్డిన్ ఎక్కువగా ఉండటమే అందుకు కారణమట.

 

– “అక్షర ఉదయమ్” న్యూస్

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..

www.aksharaudayam.in