అక్షర ఉదయమ్ – బాపట్ల :
బంగాళాఖాతంలో ఏర్పడిన మురసు తుపాను ప్రభావం నేపథ్యంలో బాపట్ల పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బాపట్ల మునిసిపల్ కమిషనర్ యం.హాసిని ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.
ఆర్టీజిఎస్ – ఏపీఎస్డీఎంఏ విడుదల చేసిన తాజా వాతావరణ హెచ్చరికల ప్రకారం, తుపాను గత ఆరు గంటలుగా గంటకు 12 కిలోమీటర్ల వేగంతో కదులుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం నెల్లూరుకు 80 కిలోమీటర్లు, కావలికి 90 కిలోమీటర్లు, ఒంగోలుకు 120 కిలోమీటర్లు, బాపట్లకు 150 కిలోమీటర్లు కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉన్నట్లు పేర్కొన్నారు.
తుపాను సోమవారం అర్ధరాత్రి నుంచి తెల్లవారు జాము మధ్య ఒంగోలు సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని, దీని ప్రభావంతో కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించిందని తెలిపారు.
ఈ నేపథ్యంలో బాపట్ల పట్టణ పరిధిలోని ప్రజలు ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని కమిషనర్ సూచించారు.
ప్రజలు పాటించవలసిన జాగ్రత్తలు
1. అత్యవసర పరిస్థితులు మినహా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దు.
2. సముద్ర తీర ప్రాంతాలకు వెళ్లడం, సముద్ర స్నానాలు చేయడం వంటి చర్యలకు దూరంగా ఉండాలి.
3. ఈదురు గాలులు, భారీ వర్షాల సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో ఆశ్రయం పొందరాదు.
4. తెగి పడిన విద్యుత్ తీగలను ఎట్టి పరిస్థితుల్లోనూ తాకరాదు. వాటిని గమనించిన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి.
5. లోతట్టు ప్రాంతాలు, ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అవసరమైన సందర్భాల్లో అధికారుల సూచనల మేరకు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలి.
6. ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. మురుగు కాలువలు, డ్రైనేజీలలో చెత్త వేయరాదు.
7. ఇంటి పరిసరాల్లో గాలికి ఎగిరిపోయే అవకాశం ఉన్న వస్తువులను సురక్షితంగా భద్రపరచుకోవాలి.
8. అత్యవసర సమయాల్లో మునిసిపల్ అధికారులు, సంబంధిత ప్రభుత్వ శాఖల సిబ్బందికి సమాచారం అందించాలి.
9. వాతావరణ పరిస్థితులపై ప్రభుత్వం, విపత్తు నిర్వహణ సంస్థలు జారీ చేసే అధికారిక హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ, అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలి.
తుపాను ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని, ఎటువంటి వదంతులను నమ్మవద్దని, సామాజిక మాధ్యమాల్లో వచ్చే ధృవీకరించని సమాచారాన్ని ప్రచారం చేయవద్దని కమిషనర్ కోరారు.
ప్రజల ప్రాణ, ఆస్తి భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, విపత్తు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రజలు మునిసిపల్ యంత్రాంగానికి సహకరించాలని, అత్యవసర పరిస్థితుల్లో అధికారులకు తక్షణ సమాచారం అందించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు.