“ఏ రాజకీయ నాయకుడు మా గ్రామానికి రావొద్దంటూ“ పెద్ద హరివాణం గ్రామస్తులు హెచ్చరిక..!
- తమ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని గ్రామస్థుల నిరసన
- గత కొద్ది రోజులుగా రిలే దీక్షలు నిర్వహిస్తున్న గ్రామస్తులు
- తాజాగా “ఏ రాజకీయ నాయకుడు మా గ్రామానికి రావద్దు” అంటూ బోర్డు ఏర్పాటు చేసిన వైనం

అక్షర ఉదయమ్ – కర్నూలు
కర్నూలు జిల్లా ఆదోని -2 మండలంలోని పెద్ద హరివాణం గ్రామస్థులు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించేంత వరకు ఏ రాజకీయ నాయకుడిని తమ గ్రామంలో అడుగు పెట్టనివ్వ కూడదని గ్రామస్థులంతా తీర్మానించారు. ఈ మేరకు ఆదివారం గ్రామ సరిహద్దులో బోర్డును ఏర్పాటు చేసి తమ నిరసనను తెలియజేశారు.
రాష్ట్రంలోనే అతి పెద్ద మండలమైన ఆదోని మండలాన్ని నాలుగు మండలాలుగా విభజించాలని గత సంవత్సరం నుండి ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. శాసన సభలో ఈ అంశంపై ప్రస్తావించారు. ఈ క్రమంలో కొద్ది రోజులుగా పెద్ద హరివాణం గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ గ్రామస్థులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు.
అయితే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆదోని మండలాన్ని రెండు మండలాలుగా విభజిస్తూ ఆదోని, పెద్ద హరివాణం మండలాలుగా ప్రకటించింది. ఇందులో ఆదోని మండలంలో 24 గ్రామాలు, పెద్ద హరివాణం మండలంలో 22 గ్రామాలను కేటాయించింది. దీంతో 16 గ్రామాల ప్రజలు పెద్ద హరివాణం మండల కేంద్రంలో విలీనాన్ని వ్యతిరేకిస్తూ దీక్షలు చేయడంతో ప్రభుత్వం వెనుకడుగు వేసి పెద్ద హరివాణం మండలం కాకుండా ఆదోని – 1, ఆదోనీ -2 మండలంగా ప్రకటించింది.
ఈ నిర్ణయంపై పెద్ద హరివాణం గ్రామ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ గత వారం రోజులుగా నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఆందోళనలో భాగంగా ఆదివారం గ్రామానికి చెందిన పలువురు మండల కేంద్రం ఏర్పాటు కోసం నిరాహార దీక్ష చేపట్టారు.
ఈ సందర్భంగా మండల సాధన కమిటీ అధ్యక్షుడు ఆదినారాయణరెడ్డి, మధు మాట్లాడుతూ తమ గ్రామాన్ని మండలంగా ప్రకటించి గెటిజ్ నోటిఫికేషన్ ఇచ్చి ఇప్పుడు ఆదోని – 1, ఆదోనీ -2 మండలాలుగా ప్రకటించడం దారుణమని అన్నారు. నాయకులు తమను, తమ గ్రామాన్ని మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఏ పార్టీ రాజకీయ నాయకులు తమ గ్రామంలోకి రావడానికి వీల్లేదని స్పష్టం చేశారు. తిరిగి మండల కేంద్రంగా ప్రకటించే వరకు ఉద్యమం ఆగదని వారు స్పష్టం చేశారు.