ప్రకాశ్ రాజ్‌తో నటిస్తారా అని అడిగారు.. నేనిలా చెప్పా: పవన్ కల్యాణ్

ప్రకాశ్ రాజ్‌తో నటిస్తారా అని అడిగారు.. నేనిలా చెప్పా: పవన్ కల్యాణ్

 

  • రాజకీయ ప్రత్యర్థి ప్రకాశ్ రాజ్‌పై పవన్ కల్యాణ్ ప్రశంసలు
  • సినిమా తనకు అమ్మ లాంటిదని స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం
  • సెట్‌లో రాజకీయాలు వద్దని మాత్రమే షరతు పెట్టానన్న పవన్
  • ప్రకాశ్ రాజ్‌ను ‘బ్రిలియంట్ యాక్టర్’ అని కొనియాడిన జనసేనాని
  • ఓజీ’ బ్లాక్‌బస్టర్ వేడుకలో ఆసక్తికర వ్యాఖ్యలు

 

రాజకీయ రంగంలో ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకునే జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్.. వెండితెరపై మాత్రం అద్భుతమైన కెమిస్ట్రీ పండించారు. వీరిద్దరూ కీలక పాత్రల్లో నటించిన ‘ఓజీ’ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో నిన్న‌ జరిగిన చిత్ర విజయోత్సవ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ప్రకాశ్ రాజ్‌తో తన వృత్తిపరమైన సంబంధంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ విబేధాలను పక్కనపెట్టి ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. “సినిమా నాకు అమ్మ లాంటిది. నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది సినిమానే. ఎవరి రాజకీయ అభిప్రాయాల కారణంగా నేను నటనకు దూరం కాను. ‘ఓజీ’ సినిమా షూటింగ్ సమయంలో ప్రకాశ్ రాజ్‌తో కలిసి నటిస్తారా? అని అడిగినప్పుడు నాకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పాను. కేవలం ఒకే ఒక్క షరతు పెట్టాను. సెట్‌లో రాజకీయ అంశాలు చర్చకు రాకూడదని కోరాను. ఆయన తన వృత్తిని గౌరవిస్తే, నేను కూడా అలాగే ఉంటానని స్పష్టం చేశాను” అని తెలిపారు.

ప్రకాశ్ రాజ్‌ను ‘బ్రిలియంట్ యాక్టర్’ అని అభివర్ణించిన పవన్, “మా మధ్య ఏమైనా ఉంటే అవి బయట చూసుకుంటాం కానీ, సినిమా సెట్‌లో కాదు. ఈ సినిమాకు ఆయన అందించిన సహకారానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను” అని అన్నారు. సాధారణంగా సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉండే పవన్, ఈ కార్యక్రమానికి హాజరై తన రాజకీయ ప్రత్యర్థిని ప్రశంసించడం అందరి దృష్టిని ఆకర్షించింది. రాజకీయంగా ఎన్ని విమర్శలు ఎదురైనా, వృత్తిధర్మానికి కట్టుబడి ఉంటానని పవన్ తన మాటల ద్వారా స్పష్టం చేశారు. ‘ఓజీ’ సినిమాలో ప్రకాశ్ రాజ్ పోషించిన సత్యదాదా పాత్రకు, పవన్ పోషించిన గంభీర్ పాత్రకు ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన లభిస్తున్న విషయం తెలిసిందే.

 

-“అక్షర ఉదయమ్” సినిమా

 

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..

www.aksharaudayam.in