రాష్ట్ర ఆక్వాకల్చర్ రంగాన్ని ప్రపంచ స్థాయిలో నిలుపుతాం
- ఆక్వా రైతుల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుంది
- రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధ్యక్షతన సచివాలయంలో ఆక్వాకల్చర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ తొలి సమావేశం నిర్వహణ
- రాష్ట్రంలోని అన్ని ఆక్వాకల్చర్ యూనిట్లు తప్పనిసరిగా రిజిస్టర్ కావాలని ఆదేశించిన మంత్రి అచ్చెన్నాయుడు
- రిజర్వాయర్లలో కేజ్ కల్చర్ ద్వారా 5 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి పెంపు లక్ష్యంగా ప్రణాళికలు
- మత్స్యరంగ అభివృద్ధి, సుస్థిరమైన ఆక్వాకల్చర్, రైతుల ఆదాయ పెంపు, దేశీయ మార్కెట్ బలోపేతం వంటి లక్ష్యాలకు తోడ్పాటు
- సుంకాల భారంపై సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు
- చికెన్ వ్యర్ధాలను చేపల చెరువులకు తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తీవ్రంగా హెచ్చరించిన మంత్రి అచ్చెన్నాయుడు

అక్షర ఉదయమ్ – అమరావతి
రాష్ట్ర ఆక్వాకల్చర్ రంగాన్నిఅంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసి, ప్రపంచ స్థాయిలో నిలుపుతామని వ్యవసాయం, సహకారం, మార్కెటింగ్, పశుసంవర్ధక, పాడి పరిశ్రమలు మరియు మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. బుధవారం వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర ఆక్వాకల్చర్ అభివృద్ధి సంస్థ (APSADA) ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం మంత్రి అధ్యక్షతన జరిగింది. రాష్ట్రంలోని మత్స్య సంపద, ఉత్పత్తి నాణ్యత, ఎగుమతి అవకాశాలు, మరియు రైతుల ఆదాయాన్ని పెంచే విధానాలపై సమగ్రంగా అధికారులతో చర్చించారు. రాష్ట్రంలో అక్వాకల్చర్ అభివృద్ధికి సంబంధించి కీలక అంశాలపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ మత్స్యశాఖలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పర్యావరణ అనుకూల పద్ధతులు, శాస్త్రీయ విధానాల వినియోగం ద్వారా ఉత్పత్తి పెంపుతో పాటు, అంతర్జాతీయ మార్కెట్‌లో ఆంధ్రప్రదేశ్ స్థాయిని మరింత బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర మత్స్యకారులు, ఆక్వా రైతులు, పరిశ్రమకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, పర్యావరణం మరియు ప్రజారోగ్యం రక్షణ ప్రథమ కర్తవ్యమని, రైతుల సంక్షేమం, ఎగుమతుల ప్రోత్సాహం, కొత్త ఉపాధి అవకాశాల దిశగా రాష్ట్రానికి మైలురాయిగా నిలుస్తాయని మంత్రి స్పష్టం చేశారు.
అక్వాకల్చర్ లైసెన్స్ ప్రక్రియ సరళీకరణ
రైతులు ఇకపై APSADA చట్టం కింద తమ ఆక్వా చెరువులను ఆన్లైన్లో సులభంగా నమోదు చేసుకోవచ్చని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ విధానం ద్వారా లైసెన్స్ పొందే ప్రక్రియ మరింత వేగవంతం అవుతుందని అన్నారు. ప్రభుత్వ ప్రయోజన పథకాలు పొందడానికి ప్రతి అక్వాకల్చర్ రైతు తమ చెరువులను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు. సముద్ర ఆహార ఎగుమతుల నాణ్యతను, ట్రేసబిలిటీని (Traceability) మెరుగుపరచడంలో ఇది ముఖ్యపాత్ర పోషిస్తుందని తెలిపారు. డి-పట్టా, అసైన్, CJFS భూములపై చేపల పెంపకం చేస్తున్న రైతులకు APSADA చట్టం ప్రకారం సాగు ధ్రువీకరణ పత్రం ఇవ్వబడుతుందని తెలిపారు. దీని ద్వారా వారు ప్రభుత్వ పథకాలు మరియు ఆర్థిక సహాయం పొందే అవకాశం కలుగుతుందని తెలియజేశారు.
పౌల్ట్రీ వ్యర్థాల వాడకం పై నిషేధం
కొన్ని ప్రాంతాల్లో పౌల్ట్రీ వ్యర్థాలను చేపల ఆహారంగా వాడుతున్నట్లు గుర్తించామని మంత్రి అన్నారు. ఇది ప్రజారోగ్యానికి హానికరంతో పాటు నీటి కాలుష్యం కావడంతో ఈ ప్రక్రియను పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. రైతులు వెంటనే ఈ విధానాన్ని నిలిపివేయాలని ఆదేశించారు. చెరువుల యజమానులు చికెన్ వ్యర్ధాలను చేపల ఆహరంగా వేసినట్లు రుజైవైతే వెంటనే వారి లైసెన్స్ లను రద్దు చేసి, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

సముద్ర మరియు జలాశయ ఫిష్ కల్చర్ (Cage Culture) విధానాలకు ఆమోదం
రాష్ట్రంలో మారికల్చర్ (Mariculture) మరియు రిజర్వాయర్ కేజ్ కల్చర్ విధానాలకు కమిటీ ఆమోదం తెలిపింది. ప్రయోగాత్మకంగా సముద్ర తీరప్రాంతాలు మరియు జలాశయాల్లో చేపల పెంపకాన్ని ప్రోత్సహించి, మత్స్యకారులు మరియు మహిళా మత్స్యకారుల జీవనోపాధి మెరుగుపరచడమే లక్ష్యం. అనువైన 4–5 ప్రాంతాలను ఎంపిక చేసిన తీరప్రాంతాల్లో సముద్ర నాచు (Sea-weed) సాగును ప్రోత్సహించడం ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. భవిష్యత్ లో మరింత విస్తరించేందుకు చర్యలు తీసకుంటారు.
అమెరికా టారిఫ్ల ప్రభావం తగ్గించడానికి చర్యలు
2025 ఆగస్టు 27 నుండి భారతీయ రోయ్య ఎగుమతులపై అమెరికా విధిస్తున్న 50% టారిఫ్‌ల ప్రభావాన్ని తగ్గించేందుకు మంత్రి ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. MPEDA సహకారంతో దక్షిణ కొరియా, యూరోప్, యూకే, మిడిల్ ఈస్ట్, రష్యా, ఆఫ్రికా వంటి కొత్త మార్కెట్లను అన్వేషించాలని సూచించారు. యూకేతో కుదిరిన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (FTA) అవకాశాలను వినియోగించుకోవాలని అన్నారు. ఎగుమతిదారులు, ప్రాసెసర్లు విలువ ఆధారిత ఉత్పత్తులపై దృష్టి పెట్టాలన్నారు. ఆక్వా రైతులకు మేలు జరిగేలా అధిక సుంకాల వ్యవహరంపై సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రాన్ ప్రొడ్యూసర్స్ కోఆర్డినేషన్ కమిటీ ని కంపెనీ చట్టం కింద ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో FFPOలు మరియు అక్వాకల్చర్ రంగంలోని ఇతర వ్యాపారులు సభ్యులుగా ఉంటారు. దేశీయ వినియోగాన్ని పెంచడానికి ఇది NECC మోడల్ తరహాలో పనిచేస్తుంది.
ఈ సమావేశంలో APSADA కో-వైస్ చైర్మన్ ఆనం వెంకట రమణా రెడ్డి, మత్స్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్, మత్స్య శాఖ కమిషనర్ రామ శంకర్ నాయిక్, ఇతర ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..