పిల్లలలో దృష్టి దోషాలను చిన్నతనంలోనే గుర్తిస్తే నివారించొచ్చు
- నేటి బాలలే రేపటి పౌరులు.. దేశ భవిషత్తు యువత చేతిలో ఉంది
- కూటమి ప్రభుత్వం దృష్టిలో రాష్ట్ర భవిషత్తు అంటే మన పిల్లలు ఉజ్వల భవిషత్తే
- సానా సతీష్ బాబు ఫౌండేషన్ – ఏలూరు టీమ్ ఆధ్వర్యంలో “చిన్నారి నేత్రాలు – సంరక్షణ” సేవా కార్యక్రమాలు స్ఫూర్తిదాయకం
- రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారధి

సానా సతీష్ బాబు ఫౌండేషన్ – ఏలూరు టీమ్ ఆధ్వర్యంలో ఏలూరు జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో చదువు కుంటున్న విద్యార్థిని, విద్యార్థులకు ఉచిత కంటివైద్య పరీక్షలు, కళ్ళజోళ్ల పంపిణీలో కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి, ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

అక్షర ఉదయమ్ – ఏలూరు
స్థానిక ఆర్ఆర్ పేట ఈదర సుబ్బమ్మాదేవి నగర పాలక ఉన్నత పాఠశాల ప్రాంగణంలో శనివారం సానా సతీష్ బాబు ఫౌండేషన్ – ఏలూరు టీమ్ ఆధ్వర్యంలో “చిన్నారి నేత్రాలు – సంరక్షణ” సేవా కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్, ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) ముఖ్య అతిథులుగా పాల్గొని వైద్య శిబిరాన్ని ప్రారంభించి, విద్యార్థిని, విద్యార్థులకు కంటి పరీక్షలను స్వయంగా పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ పిల్లల్లో దృష్టి దోషాలను చిన్నతనంలోనే గుర్తిస్తే వెంటనే నివారించ వచ్చని అన్నారు. ప్రస్తుత రోజుల్లో ప్రతీ ఇంటిలోనూ స్మార్ట్ ఫోన్లు వాడకం ఎక్కువైందని, ఇంట్లో చిన్న పిల్లలకు వారి తల్లితండ్రులు స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉంచడంతో వాటితో పిల్లలు ఎక్కువ సేపు గడుపు తున్నారని, దీని వల్ల వారిలో దృష్టి దోషాలు వచ్చే అవకాశం ఉందన్నారు. నేటి బాలలే రేపటి భావిభారత పౌరులని, వారి ఆరోగ్య పరిరక్షణ తల్లితండ్రులు బాధ్యత అన్నారు. తల్లితండ్రులు తమ పిల్లల్లోని అనారోగ్య లక్షణాలను చిన్నతనంలోనే గుర్తించి, చికిత్స అందిస్తే వాటిని నివారించి వారికి ఉజ్జ్వల భవిష్యత్తు కల్పించిన వారవుతారన్నారు. కూటమి ప్రభుత్వంలో విద్యకు అత్యంత ప్రాధాన్యనతను ఇస్తున్నదని , ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత లేకుండా ఇటీవల మెగా డీఎస్సీ నిర్వహించి 16,347 మందికి పైగా ఉపాధ్యాయులను నియమించిందని అన్నారు. విద్యార్థులు విద్యా ప్రమాణాలను మరింత పెంచేందుకు మెగా పేరెంట్స్ మీట్ నిర్వహించి, విద్యార్థులు ఏ సబ్జెక్టులలో వెనుకబడి ఉన్నారో తెలుసుకుని ఆయా సబ్జెక్టులపై అవగాహన పెంచుతున్నామన్నారు. వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, వారి ఆరోగ్య పరిస్థితి, వారి అవసరాలు, తదితరాలను తెలుసుకుని వాటిని కల్పించడం జరిగిందన్నారు. పాఠశాలలో విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు, గార్డెనింగు, పరిసరాలు పరిశుభ్రత వంటి పాఠ్యేతర కార్యకలాపాలు పట్ల ఆసక్తి కలిగించాలన్నారు.
ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ఐటి, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ సారధ్యంలో విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తీసుకు వచ్చారని అన్నారు. ఆయన స్ఫూర్తితో రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ఫౌండేషన్ ద్వారా ఏలూరు జిల్లాలో అన్ని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థిని, విద్యార్థులు కంటి వైద్య పరీక్షలు, కళ్ళజోళ్ళు పంపిణీ కార్యక్రమం ఎంతో స్ఫూర్తిదాయకం అని, ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇటువంటి మహత్తర మెగా ఉచిత వైద్య శిబిరాన్ని మొదటగా ఏలూరు జిల్లాలో ఏర్పాటు చేయడం, ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగిందన్నారు. ఇదే స్ఫూర్తితో మిగతా జిల్లాలకు ఇటువంటి సదస్సులు నిర్వహించడానికి సానా సతీష్ బాబు ఫౌండేషన్ నిర్ణయం తీసుకోవడం అభినందనీయం అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు, సేవా సంస్థలు కార్యక్రమాలు జత కలిస్తే మంచి ఫలితాలు వస్తాయని అన్నారు.
ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాష్ట్ర భవిష్యత్తు అంటే, మన పిల్లల భవిషత్తే అని అన్నారు. రాష్ట్ర ఐటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యా రంగంలో సమూల మార్పులు చేపట్టారని అన్నారు. అభివృద్ధికి విద్య ఒక్కటే రాజ మార్గమని విద్య వైద్యానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, ప్రతి యువత ఉన్నత చదువులు వైపు అడుగులు వేసి, దేశ, రాష్ట్ర భవిష్యత్తుపై దృష్టి పెట్టాలని అన్నారు. సానా సతీష్ బాబు ఫౌండేషన్ ద్వారా ఏలూరు జిల్లా ఏలూరు నియోజక వర్గంలో విద్యార్థులకు కంటి పరీక్షలు, అవసరమైన వారికి కళ్ళజోళ్ళ పంపిణీ కార్యక్రమం చెయ్యడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగిందని అన్నారు. కూటమి ప్రభుత్వం హయాంలో ప్రజా సంక్షేమానికి, అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నామని అన్నారు.
ముందుగా పాఠశాల ప్రాంగణంలో జాతిపిత గాంధీజీ, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్, పొట్టి శ్రీరాములు, ఈదర సుబ్బమ్మ దేవి విగ్రహాలకు పూలమాలలు వేసి, మంత్రి కొలుసు పార్థసారథి, పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్, ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి యం. వెంకటలక్ష్మమమ్మ, నగరపాలక కో- ఆప్షన్ సభ్యులు యస్.యం.ఆర్. పెదబాబు, ఏలూరు ఉడా చైర్మన్ పెద్దిబోయిన వాణి శివ ప్రసాదు, ఏపి యాదవ కార్పొరేషన్ డైరెక్టరు పెనుబోయిన మహేష్ కుమార్, ప్రముఖ కంటి వైద్య నిపుణులు డా.ఏ.యస్.రామ్, సానా సతీష్ బాబు ఫౌండేషన్ – ఏలూరు టీమ్ సభ్యులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పట్టణ ప్రముఖులు, కూటమి నాయకులు, విద్యార్థిని, విద్యార్థులు వారి తల్లిదండ్రులు, స్థానిక ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..
ఈ-పేపర్ కోసం www.epaper.aksharaudayam.in నీ సందర్శించండి.