నాడు భర్త, ఇప్పుడు కుమార్తె దూరమై తల్లడిల్లిన తల్లి

నాడు భర్త, ఇప్పుడు కుమార్తె దూరమై తల్లడిల్లిన తల్లి

 


కర్నూలులో శుక్రవారం తెల్లవారుజామున సంభవించిన ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు ప్రమాద ఘటన ఇంకొల్లు మండలం పూసపాడులో విషాదం నింపింది. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ గన్నమనేని ధాత్రి (27) తల్లి వాణి రోదన స్థానికులకు కంటతడి పెట్టించింది. రెండేళ్ల కిందట అనారోగ్యంతో భర్త మరణించగా, ఏకైక కుమార్తె బస్సు ప్రమాదంలో శాశ్వతంగా దూరం కావడంతో ఆమె వేదన వర్ణనాతీతం. యద్ధనపూడి మండలం పూనూరుకు చెందిన గన్నమనేని భానుప్రకాష్‌ గుంటూరులోని ఓ ప్రైవేటు కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశారు. భానుప్రకాష్, వాణి దంపతులకు ధాత్రి ఏకైక సంతానం. భర్త మరణం అనంతరం వాణి ఇంకొల్లు మండలం పూసపాడులోని తల్లి సూర్యకుమారి వద్ద ఉంటోంది. ధాత్రికి వివాహం చేయడానికి మంచి సంబంధాల కోసం చూస్తున్నారు. ఈ క్రమంలో బస్సు ప్రమాదం ఆ తల్లి ఆశలను సమాధి చేశాయి. కుమార్తె మృతదేహం గుర్తు పట్టలేని విధంగా కాలిపోవడంతో కడసారి చూపునకు నోచుకోలేక వాణి బోరున విలపించారు. డీఎన్‌ఏ పరీక్ష అనంతరం అధికారులు ధాత్రి మృతదేహాన్ని శనివారం అప్పగించనున్నట్లు తెలిసింది.