గుంటూరు విద్యార్థి పొట్టలో మూడేళ్లు పెన్ను

గుంటూరు విద్యార్థి పొట్టలో మూడేళ్లు పెన్ను

 

  • వైద్యుల చాకచక్యంతో ఆపరేషన్ లేకుండానే తొలగింపు

 

అక్షర ఉదయమ్ – గుంటూరు

 

రూ.50 కోసం వేసిన పందెం ఓ విద్యార్థి ప్రాణాల మీదకు తెచ్చే పరిస్థితి ఏర్పడింది. గుంటూరులోని కొత్తపేటకు చెందిన ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థి మురళీకృష్ణ (16) మూడు సంవత్సరాల క్రితం తొమ్మిదో తరగతిలో చదువుతున్న రోజుల్లో స్నేహితులతో రూ.50 పందెం కట్టి పెన్ను మింగేశాడు. అప్పట్లో ఎటువంటి బాధలేకపోవడంతో ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పకుండా దాచిపెట్టాడు.

ఇటీవలి కాలంలో కడుపునొప్పి తరచుగా వేస్తూనే ఉంది. డిసెంబరు 18న నొప్పి భరించలేనంతగా పెరగడంతో, మురళీకృష్ణ మూడు సంవత్సరాల క్రితం పెన్ను మింగిన విషయాన్ని అతడి స్నేహితులు తల్లిదండ్రులకు తెలియజేశారు. కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని గుంటూరు జీజీహెచ్ కు తరలించారు.

వైద్యులు సీటీ స్కాన్ చేయగా, మురళీకృష్ణ పెద్దపేగులో పెన్ను ఇరుక్కున్నట్లు నిర్ధారించారు. గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగాధిపతి డాక్టర్ కవిత ఆధ్వర్యంలో అసోసియేట్ ప్రొఫెసర్ నాగూర్ బాషా, అసిస్టెంట్ ప్రొఫెసర్ శివరామకృష్ణల బృందం రెట్రోగ్రేడ్ ఎంటెరోస్కోపీ విత్ ఓవర్ ట్యూబ్ పద్ధతితో శస్త్రచికిత్స అవసరం లేకుండానే పెన్నును విజయవంతంగా బయటకు తీశారు.

ఈ అరుదైన శస్త్రచికిత్స లేకుండా చేసిన చికిత్సతో బాలుడి ప్రాణాలను కాపాడగలిగామని ఆసుపత్రి సూపరింటెండెంట్ రమణ విలేకరుల సమావేశంలో తెలిపారు. వైద్యుల బృందాన్ని ఆయన అభినందించారు. పిల్లలు పందెం పేరుతో ఇలాంటి ప్రమాదకర చర్యలకు పాల్పడకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచించారు.