‘మొంథా’ తుఫాన్ వస్తోంది… అప్రమత్తంగా ఉండండి

మొంథా’ తుఫాన్ వస్తోంది… అప్రమత్తంగా ఉండండి

 

  • ఎక్కడా ఎటువంటి ప్రాణ, ఆస్తినష్టం జరగకూడదు
  • ముందస్తు జాగ్రత్త చర్యలతో తక్షణం సన్నద్ధమవ్వండి
  • అత్యవసర సేవలకు ఆటంకం లేకుండా అధికార యంత్రాంగం పనిచేయాలి
  • జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం
  • వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్‌తో సీఎం చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్

 

అక్షర ఉదయమ్ – అమరావతి

 

రాష్ట్రానికి ‘మొంథా’ తుఫాను పొంచివున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో శనివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘మొంథా’ తుపాన్ రాష్ట్రంపై ఈనెల 26, 27, 28, 29 తేదీల్లో తీవ్ర ప్రభావం చూపించనుందని వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేయడంతో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సీఎం సూచించారు. ప్రధానంగా ఈ నెల 28న సాయంత్రం కాకినాడ సమీపంలో ‘మొంథా’ తీవ్ర తుపానుగా మారి తీరం దాటుతుందని, ఆ సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా నుంచి తిరుపతి వరకూ దీని ప్రభావం ఉంటుందని… 80 నుంచి 100 మి.మీ. మేర భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, వరదల నుంచి ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం వాటిళ్లకుండా ఇప్పటి నుంచే సన్నాహక చర్యలు సమగ్రంగా చేపట్టాలని ఆదేశించారు. ప్రతీ జిల్లా కలెక్టర్ తుఫాన్ రక్షణ చర్యలకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకుని… తగిన వనరులతో సన్నద్ధంగా ఉండాలని చెప్పారు. తీరప్రాంత ప్రజలకు తుఫానుపై అవగాహన కల్పించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. అవసరమైతే విద్యా సంస్థలకు సెలవు ప్రకటించాలని చెప్పారు. అన్ని ప్రధాన, మధ్య తరహా రిజర్వాయర్లలో నీటిమట్టాలను పర్యవేక్షించి నీటి విడుదల శాస్త్రీయంగా జరపాలన్నారు. రియల్ టైమ్‌లో వచ్చే సమాచారాన్ని తక్షణం ప్రభుత్వ యంత్రాంగంలోని కింది స్థాయి వరకు తీసుకువెళ్లాలని చెప్పారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలను ముందుగానే సిద్ధం చేయాలని ఆదేశించారు. కాకినాడలో హాస్పిటల్ ఆన్ వీల్స్ సేవలను ప్రారంభించాలని సూచించారు. ఆర్ అండ్ బీ, విద్యుత్, నీటిపారుదల, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలు అన్నీ అప్రమత్తంగా ఉండాలన్నారు. తాగునీరు, విద్యుత్ సరఫరా, మొబైల్ టవర్స్, సివిల్ సప్లైస్ వంటి అత్యవసర సేవలు నిరంతరం కొనసాగేలా చూడాలని నిర్దేశించారు. తుఫాన్ ప్రభావిత జిల్లాలకు ఇన్‌ఛార్జి అధికారులను నియమించి, తుఫాను నష్ట నివారణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.

“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..

www.aksharaudayam.in

ఈ-పేపర్ కోసం www.epaper.aksharaudayam.in నీ సందర్శించండి.