పాక్‌లోని ఉగ్ర శిబిరాల పై భారత్ దాడి
పహెల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ మంగళవారం రాత్రి సర్జికల్ స్ట్రైక్ జరిపింది. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై క్షిపణి దాడులు జరిపి నేలమట్టం చేసింది.
పాకిస్తాన్ గగనతలంలోకి వెళ్లకుండానే సరిహద్దుకు సమీపంలో భారత వైమానిక దళ యుద్ధ విమానం నుంచి లక్షిత ఉగ్రవాద శిబిరాలపై క్షిపణి దాడులు చేపట్టింది. ఇందులో మురిద్కే, కోట్లి, ముజఫరాబాద్, బహవల్పూర్లలోని ఉగ్రశిబిరాలు నేలమట్టమయినట్టు తెలిసింది.
ఆపరేషన్ సింధూర్ పేరిట ఈ దాడులు జరిపినట్టు కేంద్ర ప్రభుత్వం అర్ధరాత్రి దాటిన తర్వాత 1.44 గంటలకు వెల్లడించింది. ఈ దాడుల్లో పాకిస్తాన్ మిలిటరీ ఫెసిలిటీలను టార్గెట్ చేయలేదని తెలిపింది.
ఇండియా చాలా జాగ్రత్తగా టార్గెట్లను ఎంచుకున్నదని వివరించింది. భారత భద్రతా బలగాలు పాకిస్తాన్ నుంచి ప్రతీకార చర్యలకు తావులేకుండా జాగ్రత్తగా ఆపరేషన్ చేపట్టింది. భారత్ పై దాడులకు కుట్ర పన్నిన, దాడికి పాల్పడిన ఉగ్రవాదుల స్థావరాలనే నాశనం చేసినట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది.

దాడి తర్వాత పహెల్గాం బాధితులకు న్యాయం దక్కిందని భారత ఆర్మీ సోషల్ మీడియాలో 1.51 గంటలకు పోస్టు పెట్టింది. పహెల్గాంలో అమానవీయ దాడి జరిపారని, దోషులను శిక్షిస్తామన్న తమ సంకల్పానికి ఆచరణ రూపం ఇచ్చామని కేంద్రం తెలిపింది. ఆపరేషన్ సింధూర్ గురించి కేంద్రం నేడు అధికారికంగా వివరాలు వెల్లడించనుంది.
– అక్షర ఉదయమ్ న్యూస్






