యూపీఐ పేమెంట్స్‌లో మోసాల పట్ల వ్యాపారస్తులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

యూపీఐ పేమెంట్స్‌లో మోసాల పట్ల వ్యాపారస్తులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

 

  • మీరు డబ్బులు స్వీకరించాలనుకుంటే పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదని గుర్తుంచుకోండి
  • చాలా వరకు యూపీఐ మోసాలు యూజర్లు అప్రమత్తంగా లేకపోవడంతో జరుగుతుంటాయి
  • – బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్, ఐపీఎస్ గారు

 

అక్షర ఉదయమ్ – బాపట్ల

ఎవరైనా దుకాణాలు, షాపుల వద్ద వస్తువులు కొనుగోలు చేసి నగదు చెల్లిస్తామని మీ ఫోన్ లేదా మీ యూపీఐ పిన్ అడుగుతున్నారంటే వారు మోసం చేస్తున్నారని గ్రహించాలని జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ గారు ప్రజలను హెచ్చరించారు. నేషనల్ సైబర్ సెక్యూరిటీ అవగాహన క్యాంపెయిన్‌లో భాగంగా శనివారం జిల్లా ఎస్పీ గారు యూపీఐ పేమెంట్స్‌లో జరిగే మోసాల గురించి వివరించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ ఎఫైర్స్ I4C (Indian Cyber Crime Coordination Centre) వారు అక్టోబర్ నెలను సైబర్ నేరాల అవగాహన మాసంగా ప్రకటించినందున దానిలో భాగంగా జిల్లా వ్యాప్తంగా సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను అప్రమత్తం చేయడం జరుగుతోందని చెప్పారు. ఈ రోజు ప్రత్యేకంగా యూపీఐ పేమెంట్స్ పేరుతో జరగుతున్న సైబర్ మోసాల గురించి ప్రజలు, వ్యాపారస్తులకు అవగాహన కల్పించడానికి జిల్లా పోలీస్ అధికారులు తమ పరిధిలోని మార్కెట్లలో, వ్యాపార సముదాయాల్లో ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు.

దుకాణదారులు అపరిచిత వ్యక్తులకు యూపీఐ పిన్ నమోదు సంఖ్య చెప్పవద్దని, యూపీఐ మోసాల పట్ల విజ్ఞతతో ఉండాలని ఎస్పీ గారు సూచించారు. ఒక్కసారి సైబర్ నేరస్తుల వలలో పడితే పోయిన డబ్బులను తిరిగి పొందడం చాలా కష్టం కాబట్టి జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. టెక్నాలజీ అభివృద్ధితో నగదు బదిలీ చేయడం, ఆన్లైన్ పేమెంట్స్ చేయడం చాలా సులభమైందని చెప్పారు. స్మార్ట్‌ ఫోన్‌లో పేమెంట్ యాప్‌లను ఉపయోగించి సులబంగా లావాదేవీలు చేస్తున్నారని, లక్షల్లో లావాదేవీలు కూడా క్షణాల్లో జరిగిపోతున్నాయని చెప్పారు.

ఎవరైనా తెలియని వ్యక్తులు మీ దుకాణానికి వచ్చి వస్తువులు కొనుగోలు చేసి ఫోన్‌పే, గూగుల్‌పే లేదా ఇతర పేమెంట్ యాప్‌ల ద్వారా నగదు చెల్లిస్తామని మీ మొబైల్ ఫోన్ తీసుకొని, ముందుగా రూ.1/- పంపి తర్వాత యూపీఐలో మనీ రిక్వెస్ట్ పంపి మీ అకౌంటులోని మొత్తం డబ్బుని దొంగిలిస్తున్నారన్నారు. కావున ఎట్టి పరిస్థితులలోనూ మీ ఫోన్ ఇతరులకు ఇవ్వకూడదు, మీ ఫోన్‌కు వచ్చిన OTP ఇతరులకు చెప్పకూడదని ఎస్పీ గారు హెచ్చరించారు.

యూపీఐ పేమెంట్స్ విషయంలో జాగ్రత్త తీసుకోకపోతే సైబర్ నేరస్తుల మోసానికి గురయ్యే అవకాశాలున్నాయని తెలిపారు. ఒకవేళ సైబర్ మోసానికి గురైనట్లు గ్రహిస్తే వెంటనే సైబర్ హెల్ప్‌లైన్ నెంబర్ 1930 కు కాల్ చేయాలని, లేదా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలన్నారు. మీ దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలన్నారు.