వాట్సాప్ లింక్‌తో రైతుకు రూ.16.82 లక్షల టోకరా
- పిడుగురాళ్ళ మండలం బ్రాహ్మణపల్లిలో ఘటన
- రూ.16,82,875 నగదు మాయం
- పల్నాడు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు
అక్షర ఉదయమ్ – పిడుగురాళ్ళ
ఆధునిక సాంకేతికత అమాయక గ్రామీణుల పాలిట శాపంగా మారుతోంది. సైబర్ నేరగాళ్లు విసిరిన వలకు పల్నాడు జిల్లాలో ఓ నిరుపేద రైతు నిలువునా మోసపోయాడు. ఏడాదంతా ఎండనకా, వాననకా రెక్కలు ముక్కలు చేసుకుని పంటలు పండించగా వచ్చిన కష్టార్జితం కేవలం ఒకే ఒక్క వాట్సాప్ లింక్‌తో క్షణాల్లో ఆవిరై పోయింది. గుర్తు తెలియని లింక్‌ను క్లిక్ చేయడంతో బ్యాంకు ఖాతాలోని ఏకంగా రూ.16,82,875 నగదును సైబర్ కేటుగాళ్లు కాజేయడంతో ఆ రైతు లబోదిబోమంటున్నాడు.
కష్టార్జితాన్ని దాచుకుంటే కాజేశారు
పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన రైతు బోనం కోటేశ్వరరావు వ్యవసాయ భూమిలో మిరప, కందులు, పత్తి తదితర పంటలను సాగు చేశారు. ఇటీవల మార్కెట్‌లో పంటను విక్రయించగా వచ్చిన సొమ్ము మొత్తాన్ని భవిష్యత్తు అవసరాల కోసం స్థానిక యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పిడుగురాళ్ళ బ్రాంచ్ ఖాతాలో భద్ర పరచుకున్నారు.
ఈ క్రమంలో ఇటీవల మొబైల్‌కు వాట్సాప్ ద్వారా గుర్తు తెలియని నంబర్ నుంచి ఒక అనుమానాస్పద లింక్ వచ్చింది. ఆ లింక్ దేనికి సంబంధించిందో తెలుసుకోవాలనే కుతూహలంతో ఆ లింక్‌ను ఓపెన్ చేశారు. బాధితుడు లింక్ క్లిక్ చేసిన కొద్దిసేపటికే ఖాతా నుంచి విడతల వారీగా మొత్తం రూ.16,82,875 నగదు ఇతర ఖాతాలకు బదిలీ అయిపోయింది. ఖాతాలో సొమ్ము మాయమైనట్లు గుర్తించిన బాధితుడు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యాడు.
జిల్లా ఎస్పీకి ఫిర్యాదు
ఏడాది పొడవునా చెమటోడ్చి పండించిన పంట సొమ్ము కళ్ల ముందే హరించుకు పోవడంతో లబోదిబోమంటూ బాధితుడు స్థానిక పిడుగురాళ్ళ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. అనంతరం నరసరావుపేటలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీకి లిఖిత పూర్వకంగా సైబర్ క్రైమ్ విభాగంలో ఫిర్యాదు అందజేశారు. తన కష్టార్జితాన్ని ఎలాగైనా రికవరీ చేసి ఆదుకోవాలని జిల్లా ఎస్పీని వేడుకున్నారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి, సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు ప్రారంభించారు.
బాధితులు వెంటనే ఏం చేయాలి..?
1. గోల్డెన్ అవర్ (మొదటి 24 గంటలు) : ఖాతా నుంచి అక్రమంగా డబ్బులు డెబిట్ అయిన వెంటనే ఆలస్యం చేయకుండా జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930 కు డయల్ చేయాలి.
2. వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదు : కేంద్ర ప్రభుత్వ అధికారిక పోర్టల్ cybercrime.gov.in లో లావాదేవీ రసీదు, యుటిఆర్ నంబర్, సందేశాల స్క్రీన్‌షాట్‌లతో ఫిర్యాదు నమోదు చేయాలి.
3. బ్యాంకును అప్రమత్తం చేయడం : వెంటనే సంబంధిత బ్యాంకు బ్రాంచ్ లేదా కస్టమర్ కేర్‌కు సమాచారం అందించి ఖాతా, ఏటీఎం/నెట్ బ్యాంకింగ్ సేవలను నిలిపి వేయించాలి (బ్లాక్ చేయించాలి).
ప్రజలకు సైబర్ నిపుణుల హెచ్చరికలు :
అనుమానాస్పద లింకులు క్లిక్ చేయవద్దు : వాట్సాప్, ఎస్‌ఎంఎస్, టెలిగ్రామ్‌లలో ‘లాటరీ తగిలింది’, ‘కరెంటు బిల్లు అప్‌డేట్’, ‘పీఎం కిసాన్ కేవైసీ’, ‘బ్యాంకు ఖాతా బ్లాక్ కాకుండా ఉండటానికి’ అంటూ వచ్చే లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయకూడదు.
ఏపీకే ఫైల్స్ డౌన్‌లోడ్ చేయవద్దు :వాట్సాప్‌లో వచ్చే గుర్తుతెలియని ఫైల్స్‌ను డౌన్‌లోడ్ చేస్తే ఫోన్ సైబర్ నేరగాళ్ల ఆధీనంలోకి వెళ్లే ప్రమాదం ఉంది.
గోప్యత ముఖ్యం : బ్యాంక్ పాస్‌వర్డ్‌లు, యూపీఐ పిన్, ఆధార్ వివరాలు, ఓటీపీలను ఎవరితోనూ పంచుకోవద్దు. బ్యాంకులు లేదా ప్రభుత్వ సంస్థలు ఎప్పుడూ ఫోన్లలో ఓటీపీలు అడగవని గుర్తించాలి.





