‘ సృష్టి ‘ అక్రమాల కేసులో ముగ్గురు ప్రభుత్వ వైద్యుల సస్పెన్షన్

అక్షర ఉదయమ్ – అమరావతి
హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా నడుస్తూ సంతాన సాఫల్య సేవల్లో అక్రమాలకు సంబందించిన ‘సృష్టి’ కేసులో ప్రభుత్వ వైద్య కళాశాలలు / బోధనాసుపత్రులకు చెందిన ముగ్గురు వైద్యులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
ఈ వ్యవహారంలో ఆంధ్ర మెడికల్ కాలేజి, విశాఖపట్నంలో ఎనస్థిషియా విభాగాధిపతి డా. వాసుపల్లి రవి, గైనకాలజీ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ డా.పి.ఉషాదేవి, శ్రీకాకుళం ప్రభుత్వ వైద్య కళాశాలలో పిడియాట్రిక్స్ విభాగంలో పని చేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఎ.విద్యుల్లత లపై గత నెలలో ఆరోపణలు వచ్చాయి. వీరు ముగ్గురిపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. సరోగమి చట్టం, జువినైల్ జస్టిస్ చట్టంలోని పలు సెక్షన్ల క్రింద వీరిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేసినట్లు గత నెల 28న హైదరాబాద్ పోలీసులు అధికారికంగా తెలిపారు.
ఈ నేపథ్యంలో ఈ ముగ్గురు వైద్యులపై నమోదైన ఆరోపణల తీవ్రత దృష్ట్యా వారిని పోలీసులు అరెస్టు చేసిన తేదీ నుంచి సస్పెండ్ చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాలిచ్చారు. వీరిని విధుల్లో కొనసాగిస్తే వ్యవస్థ పట్ల ప్రజా విశ్వాసం సన్నగిల్లుతుందని, కేసుల విచారణకు ఆటంకం కలిగించే అవకాశమున్నందున వారిని సస్పెండ్ చేయాలని మంత్రి ఆదేశించారు.
ఈ ముగ్గురు వైద్యులు ‘సృష్టి ‘ అక్రమాల కేసులో అరెస్టు అయినట్లు గత నెల 9న వార్తలు వచ్చాయని, వారిపై చర్యలు తీసుకోవడానికి ఆలస్యం ఎందుకు అయిందని మంత్రి వాకబు చేశారు. పత్రికల్లో వార్తల నేపథ్యంలో వెంటనే నిర్ధారణ కోసం సంప్రదించగా, గత నెల 28న అరెస్టు తేదీలు, నిందితులు జ్యూడిషియల్ కస్టడీలో ఉన్న వ్యవధి వివరాలను హైదరాబాద్ పోలీసులు తెలిపారని అధికారులు వివరించారు.
‘సృష్టి ‘ అక్రమాలు మీడియాలో వచ్చిన కొద్ది రోజులు ముందు నుంచి ఆ ముగ్గురు వైద్యులు విధుల్లో లేరని, తదనంతరం వారిని సంప్రదించడానికి ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్ళు చేసిన ప్రయత్నాలు ఫలించ లేదని మంత్రికి అధికారులు వివరించారు.
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..