తల్లుల ఖాతాల్లోకి తల్లికి వందనం నిధులు – ఆనందంలో కుటుంబాలు

తల్లుల ఖాతాల్లోకి తల్లికి వందనం నిధులు
– ఆనందంలో కుటుంబాలు


అక్షర ఉదయమ్ – అమరావతి

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న సందర్భంగా సూపర్ సిక్స్‌లో ప్రధానమైన తల్లికి వందనం హామీని అమలు చేసింది ప్రభుత్వం. ఇచ్చిన మాట ప్రకారం తల్లికి వందనం నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో తల్లికి వందనం నిధుల జమ ప్రారంభమైంది. తల్లుల ఖాతాల్లో నిధులు జమ అవుతున్నాయి. శుక్రవారం సాయంత్రానికి సుమారు 54 లక్షల మంది విద్యార్థిని విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. ఒక్కొక్కరికీ 13 వేల రూపాయల చొప్పున జమ చేయనున్నారు. ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి తల్లికి వందనం నిధులు ఇవ్వనున్నారు.

ముగ్గురు పిల్లలు చదువుతుంటే 39 వేల రూపాయలు జమ అవుతుండటంతో వారి కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఒక కుటుంబంలో ఇద్దరు పిల్లలు చదువుకుంటుంటే వారికి 26 వేల రూపాయలు జమ అవుతున్నాయి. ఫోన్లకు బ్యాంక్‌‌ల నుంచి మెసేజ్‌లు వస్తుండటంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

కాగా ఎన్నికల్లో ఇచ్చిన హామీని ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తోంది కూటమి సర్కార్. ఇప్పటికే పింఛన్ల పెంపు, అన్నా క్యాంటీన్లు, మెగా డీఎస్సీ, దీపం-2 పథకాలను అమలు చేసింది. ఇప్పుడు తాజాగా సూపర్ సిక్స్‌ హామీల్లో అతి కీలకమైన తల్లికి వందనం పథకం కింద నిధులను తల్లుల ఖాతాల్లో జమ ప్రక్రియను మొదలు పెట్టింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అవుతున్న సందర్భంగా తల్లులకు కానుకగా తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం మీడియా సమావేశంలో తెలియజేశారు. మంత్రి లోకేష్‌తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు సీఎం.

ఇందులో భాగంగా అధికారుల సమక్షంలో తల్లికి వందనం జీవోలను మంత్రి లోకేష్‌‌కు ముఖ్యమంత్రి అందజేశారు. అర్హులందరికీ తల్లికి వందనం నిధులు జమ చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో 67,27,164 మంది విద్యార్థులకు తల్లికి వందనం పథకం వర్తించనుంది. ఇందుకు అవసరమయ్యే రూ.8,745 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. అయితే ఈ 15 వేలల్లో తల్లుల ఖాతాల్లో రూ.13 వేలను జమ చేసి, మిగిలిన రూ.2 వేలను పాఠశాలల మెయింటనెన్స్ గ్రాంట్ కోసం జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉండే ఖాతాకు మళ్లించనున్నారు. అలాగే ఈ విద్యా సంవత్సరంలో ఒకటో తరగతి, ఇంటర్మీడియట్‌ మొదటి ఏడాదిలో చేరే విద్యార్థులకూ పథకాన్ని అమలు చేయనుంది సర్కార్.

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..