
చంద్రబాబు అంటే అభివృద్ధికి అంబాసిడర్
– ఆయన స్పూర్తితో ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్నాం
– రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి
అక్షర ఉదయమ్ – నూజివీడు: చంద్రబాబు అంటే అభివృద్ధికి అంబాసిడర్ అని, ఆయన స్పూర్తితో ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్నామని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు.
నూజివీడు సత్యనారాయణ థియేటర్ ఎదురుగా వికాస్ కాలేజ్ పక్కన నూతనంగా నిర్మించిన సి.సి రోడ్డును రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి చివరి నాటికి గుంతల రహిత రహదారులే లక్ష్యంగా రోడ్ల అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులున్నా ప్రజలకు మెరుగైన రహదారులు అందించాలనే లక్ష్యంతో రూ.861 కోట్ల నిధులతో రోడ్ల మరమ్మతు పనులు చేపడుతున్నామని అన్నారు.
పట్టణంలో మురుగు డ్రైనేజీలను పరిశీలించిన మంత్రి
పట్టణంలో పలు ప్రాంతాల్లో పర్యటించిన రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి చెత్త పేరుకు పోయిన మురుగు డ్రైనేజీలు పరిశీలించారు. వాటిని తక్షణమే పూడిక తీయించి మురుగు నీటి పారుదల సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.