బాధ్యతాయుతమైన జర్నలిజం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుంది
- పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా
- ప్రజాస్వామ్య విలువలు, ప్రజా అవగాహనను కాపాడటంలో మీడియా కీలక పాత్ర
- మొదటి కమిటీ సమావేశంలో 414 మంది జర్నలిస్టులకు అక్రిడిటేషన్ ఆమోదం

అక్షర ఉదయమ్ – నరసరావుపేట
ప్రజాభిప్రాయాన్ని రూపొందించడంలో, ప్రజాస్వామ్య విలువలను కాపాడడంలో, ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరించడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పేర్కొన్నారు. బాధ్యతాయుతమైన జర్నలిజం సమాజంలో అవగాహనను వ్యాప్తి చేయడమే కాకుండా, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు త్వరగా చేరేలా చూస్తుందని ఆమె అన్నారు. జర్నలిస్టుల సంక్షేమం, భద్రత, వృత్తి పరమైన గౌరవాన్ని కాపాడటానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఆమె నొక్కి చెప్పారు.
మంగళవారం కలెక్టరేట్లో జరిగిన పల్నాడు జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సమావేశానికి కలెక్టర్ అధ్యక్షత వహించారు. సమావేశంలో జిల్లా సమాచార, ప్రజా సంబంధాల అధికారి దీప్తి మీడియా అక్రిడిటేషన్ నియమాలు-2025కి సంబంధించిన అజెండా అంశాలు, కీలక అంశాలను కమిటీ సభ్యులకు వివరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకు రావడం ద్వారా, సమాజాన్ని సరైన దిశలో నడిపించడం ద్వారా, అభివృద్ధి కార్యకలాపాలపై ప్రజల విశ్వాసాన్ని పెంపొందించడంలో మీడియా అమూల్యమైన పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. తప్పుడు సమాచారానికి అవకాశం ఇవ్వకుండా వాస్తవాల ఆధారంగా బాధ్యతాయుతమైన వార్తలను ప్రచురించడం ద్వారా సమాజానికి తోడ్పడాలని ఆమె జర్నలిస్టులకు సూచించారు.
తరువాత ప్రింట్ మీడియా, నెల వారీ ప్రచురణలు, మ్యాగజైన్లు, ఎలక్ట్రానిక్ మీడియా, కేబుల్ టీవీ, ఏపీ ఫైబర్ నెట్ ద్వారా ప్రసారం అయ్యే ఛానెళ్లలో పని చేస్తున్న జిల్లాలోని అర్హత కలిగిన జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు మంజూరు చేయాలని కమిటీ ప్రతిపాదించింది. మొదటి కమిటీ సమావేశంలో మొత్తం 414 అక్రిడిటేషన్లకు ఆమోదం లభించింది.