ఏపీలో వర్కింగ్ జర్నలిస్టులకు ప్రమాద బీమా
- ప్రమాదంలో మృతి చెందితే కుటుంబానికి రూ.10 లక్షలు
- త్వరలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు
- అక్షర ఉదయమ్ – విశాఖపట్నం
రాష్ట్ర వ్యాప్తంగా వర్కింగ్ జర్నలిస్టులకు ప్రమాద బీమా పాలసీని పునరుద్ధరించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఇందుకు సంబంధించిన ఆర్థిక శాఖ అనుమతి కూడా లభించిందని, పాలసీ త్వరలోనే అమల్లోకి రానుందని మంత్రి వెల్లడించారు.
ఇటీవల భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా విశాఖ జర్నలిస్టు ఫోరం ప్రెస్‌క్లబ్‌కు విచ్చేసిన మంత్రి కొలుసు పార్థసారథిని జర్నలిస్టులు కలిశారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల సమస్యలపై మంత్రితో చర్చించారు. ఇందుకు సంబంధించి మంత్రికి పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. ముఖ్యంగా ప్రమాద బీమా పాలసీ పునరుద్ధరణతో పాటు జర్నలిస్టులకు నివాస స్థలాల కేటాయింపు అంశాలను ఆయన మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
దీనిపై స్పందించిన మంత్రి పార్థసారథి మాట్లాడుతూ రెండు రోజుల క్రితమే జర్నలిస్టుల ప్రమాద బీమా పాలసీ పునరుద్ధరణకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, ఆర్థిక శాఖ నుంచి కూడా అనుమతి లభించిందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 20 వేల మంది అక్రిడిటేషన్ కలిగిన జర్నలిస్టులకు ఈ పథకం ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.
ప్రమాద బీమా పాలసీ పరిధిలో ఉన్న జర్నలిస్టు ప్రమాదవశాత్తూ మృతి చెందితే, కుటుంబానికి 10 లక్షల ఆర్థిక పరిహారం అందుతుందని మంత్రి వివరించారు. జర్నలిస్టులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
గతంలో జర్నలిస్టుల ప్రమాద బీమా పాలసీని అప్పటి ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో జర్నలిస్టులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని మంత్రి గుర్తు చేశారు. అర్హత కలిగిన జర్నలిస్టులకు నివాస స్థలాలు మంజూరు చేసేందుకు కూడా ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.
జర్నలిస్టులకు ఎంతో ఉపయోగకరం
జర్నలిస్టుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రమాద బీమా పాలసీని పునరుద్ధరించేందుకు చొరవ చూపిన మంత్రి కొలుసు పార్థసారథికి జర్నలిస్టులు ధన్యవాదాలు తెలిపారు. ఈ పాలసీ జర్నలిస్టులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వారు పేర్కొన్నారు.