అనుమతులు లేని లే అవుట్లపై కఠిన చర్యలు
- పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ సంజనా సిన్హా
- ప్లాట్లు కొనుగోలు చేసే ముందు అనుమతులు పరిశీలించాలి : పల్నాడు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ
అక్షర ఉదయమ్ – పల్నాడు ప్రతినిధి
పల్నాడు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలో అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా వెలుస్తున్న అనధికార లే అవుట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ సంజనా సిన్హా, అధికారులు హెచ్చరించారు. అనుమతులు లేని లే అవుట్లను గుర్తించి చట్ట పరమైన చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
అనధికార లే అవుట్లలో ఏర్పాటు చేసిన రాతి స్తంభాలు, రోడ్లు, సరిహద్దులను తొలగించడంతో పాటు అవసరమైన చోట లే అవుట్లను తొలగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించి లే అవుట్లు ఏర్పాటు చేసే రియల్ ఎస్టేట్ వ్యాపారులు, డెవలపర్లపై కేసులు నమోదు చేసి క్రిమినల్ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
- అనధికార ప్లాట్లు కొంటే నష్టాలే
అనుమతి లేని లే అవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేస్తే భవిష్యత్తులో అనేక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఇలాంటి ప్లాట్లకు ప్రభుత్వ అనుమతులతో కూడిన రిజిస్ట్రేషన్ సమస్యలు తలెత్త వచ్చని, ఇల్లు నిర్మించేందుకు మున్సిపాలిటీ లేదా పంచాయతీ నుంచి అనుమతులు పొందడం కష్టమవుతుందని తెలిపారు.
అలాగే విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ వంటి ప్రభుత్వ సదుపాయాలు పొందడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని, ప్రభుత్వ అనుమతులు లేని ఆస్తులకు బ్యాంకు రుణాలు కూడా లభించక పోవచ్చని హెచ్చరించారు.
- ప్లాట్ కొనుగోలు ముందు జాగ్రత్తలు
ప్లాట్ కొనుగోలు చేసే ముందు సంబంధిత లే అవుట్‌కు అధికారిక అనుమతి ఉందో లేదో తప్పనిసరిగా పరిశీలించాలని అధికారులు సూచించారు. డెవలపర్లు చూపించే లే అవుట్ ప్లాన్‌పై లే అవుట్ పర్మిషన్ (ఎల్.పి.) నెంబర్ ఉందో లేదో తనిఖీ చేయాలని తెలిపారు.
వెంచర్ వద్ద ఏర్పాటు చేసిన బోర్డులు, ఆకర్షణీయమైన ప్రకటనలను మాత్రమే నమ్మి కష్టపడి సంపాదించిన డబ్బును పెట్టుబడిగా పెట్టవద్దని ప్రజలకు సూచించారు.
- రియల్ ఎస్టేట్ వ్యాపారులకు హెచ్చరిక
ముందస్తు అనుమతులు లేకుండా లే అవుట్లు ఏర్పాటు చేయడం, వాటికి ప్రకటనలు ఇవ్వడం లేదా ప్లాట్ల విక్రయాలు చేపట్టడం చేస్తే శాఖా పరమైన చర్యలతో పాటు క్రిమినల్ చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.
అనధికార లే అవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసి ఆర్థికంగా, చట్ట పరంగా నష్ట పోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎక్కడైనా అనుమతులు లేకుండా లే అవుట్లు ఏర్పాటు చేస్తున్నట్లు గుర్తిస్తే వెంటనే స్థానిక అధికారులకు సమాచారం అందించాలని కోరారు.