19న విశాఖలో ఇళ్ల పట్టాల పండుగ : ఒకేసారి 25,880 కుటుంబాలకు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఇళ్ల పట్టాల పంపిణీ

📰 Generate e-Paper Clip

19న విశాఖలో ఇళ్ల పట్టాల పండుగ

 

  • ఒకేసారి 25,880 కుటుంబాలకు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఇళ్ల పట్టాల పంపిణీ
  • త్వరలో విజయవాడలోనూ 24 వేల కుటుంబాలకు హక్కుల కల్పన
  • జీవో నెంబర్ 30 ద్వారా ఇప్పటికే 12 వేల ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ
  • ఒక్క మంగళగిరిలోనే 5 వేల కుటుంబాలకు లబ్ది
  • పేద ప్రజల సంక్షేమం పట్ల కూటమి ప్రభుత్వ చిత్తశుద్దికి మరో నిదర్శనం 
  • రాష్ట్ర రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్

 

 

అక్షర ఉదయమ్ – అమరావతి

 

పేద ప్రజల సంక్షేమానికి కట్టుబడిన కూటమి ప్రభుత్వం విశాఖ జిల్లాలో ఒకేరోజు 25,880 పేద కుటుంబాల జీవితాల్లో సంతోషం నింపుతోంది. ఈనెల 19వ తేదీన విశాఖలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వ స్థలాల్లో నివాసాలు నిర్మించుకున్న 25,880 కుటుంబాలకు పూర్తి హక్కులు కల్పిస్తూ పట్టాలు పంపిణీ చేయనున్నారు. ప్రతి ఒక్కరికి కూడు,గుడ్డ, నీడ తప్పనిసరిగా ఉండాలన్న టీడీపీ సిద్దాంతానికి అనుగుణంగా 2024లో ఆంధ్రలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వివిధ ప్రభుత్వ స్థలాల్లో అభ్యంతరం లేని ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించుకున్న పేదలకు హక్కులను కల్పించేలా వివిధ రకాల జీవోలను జారీ చేసింది. ఆ జీవోల అమల్లో భాగంగా ఒక్క విశాఖ జిల్లాలోనే 11 మండలాల్లో 25,880 మందికి వారి ఆస్తులపై పూర్తి హక్కులు కల్పిస్తున్నారు. అదే విధంగా రానున్న కాలంలో విజయవాడలోనూ 24 వేల మంది కుటుంబాలకు ఇళ్ల స్థలాలను రెగ్యులరైజ్ చేయనున్నారు. ఇప్పటికే జీవో నెంబర్ 30 ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 12 వేల మందికి వారి ఇంటి స్థలాలపై హక్కులు కల్పించారు. మరో 9 వేల దరఖాస్తులు పెండింగ్ లో ఉండగా వాటిని కూడా వీలైనంత త్వరగా పరిష్కరించనున్నారు. యువ మంత్రి లోకేష్ చొరవతో ఒక్క మంగళగిరి నియోజకవర్గంలోనే 5 వేల కుటుంబాలకు పట్టాలను రెగ్యులరైజ్ చేశారు. విశాఖలో 25,880 మందికి దాదాపు 400 ఎకరాల్లో విస్తరించిన ఉన్న ఇళ్ళ పట్టాలను రెగ్యులరైజ్ చేస్తున్నారు. విశాఖలో జీవో నెంబర్ 296 కింద 22,326 ఇళ్ల స్థలాలకు, జీవో నెంబర్ 388 కింద 613 మందికి, జీవో నెంబర్ 84 కింద 156 మందికి, జీవో నెంబర్ 30 కింద 1842 మందికి, జీవో నెంబర్ 45 కింద 943 మందికి హక్కులు కల్పిస్తున్నారు. విశాఖ రూరల్ మండలంలో అత్యధికంగా 8074 మందికి, ములగాడ మండలంలో 4213 మందికి, గాజువాక మండలంలో 3999 మందికి, గోపాల పట్నం మండలంలో 2,956 మందికి, పెందుర్తి మండలంలో 2,736 కుటుంబాలకు, పెద గంట్యాడ మండలంలో 1694 మందికి, మహరాణిపేట మండలంలో 1228 కుటుంబాలకు మేలు జరుగుతోంది. 

 

  • ప్రతి కుటుంబానికీ ఇళ్లు : మంత్రి అనగాని

 

రాష్ట్రంలో ఏ పేదవాడు కూడా ఇళ్లు లేకుండా ఉండకూడదనేది తమ కూటమి ప్రభుత్వ విధానమని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్స్ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. అందులో భాగంగానే అందరికీ ఇళ్లు పథకం కింద గ్రామాల్లో మూడు సెంట్లు, పట్టణాల్లో రెండు సెంట్లు పేదలకు ఉచితంగా స్థలం కేటాయిస్తున్నట్లు చెప్పారు. దీంతోపాటు వివిధ ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకొని నివాసం ఉంటున్న కుటుంబాలకు వారి ఆస్తిపై హక్కులు కల్పిస్తున్నామని అన్నారు. ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం భూమిని అసైన్ చేసి 10 ఏళ్లు దాటితే అటువంటి స్థలాలకు కూడా పూర్తి హక్కులు కల్పిస్తున్నామన్నారు. అలాగే గ్రామ కంఠాల్లో ఉన్న ఇళ్లు, ఇళ్ల స్థలాలను కూడా రిజిస్ట్రేషన్ చేయించుకునే అవకాశం కల్పించామని అన్నారు. అర్బన్ ల్యాండ్ సీలింగ్ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న వారికి కూడా క్రమబద్దీకరణ చేస్తున్నామన్నారు. పేదవాడికి పూర్తి హక్కులతో ఇళ్లు అనే కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలా కొనసాగిస్తున్నామని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం పేద ప్రజల ఆశలు, ఆకాంక్షలతో ఆటలాడుకుందని, పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తామనే పేరుతొ వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడిందని అన్నారు. తీరా పేదలకు ఇచ్చిన సెంటు, సెంటున్నర స్థలం కూడా నివాసానికి పనికి రానిది ఇచ్చారని విమర్శించారు. పేదల జీవితాల్లో వెలుగు నింపేలా వారు నిర్మించుకున్న ఇళ్లకు హక్కులు కల్పించాలనే కనీస ఆలోచన కూడా గత ప్రభుత్వం ప్రభుత్వం చేయలేదని మంత్రి అనగాని సత్యప్రసాద్ ధ్వజమెత్తారు.