అక్షర ఉదయమ్, అమరావతి :
అర్నబ్ తుపాన్ బీభత్సం నుంచి రాష్ట్రాన్ని సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. తుపాన్ ప్రభావం మొదలైనప్పటి నుంచి నాలుగు రోజులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతర పర్యవేక్షణ, క్షేత్రస్థాయి పర్యటనలతో సహాయక చర్యలను వేగవంతం చేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు పర్యటనకు బయలుదేరే ముందు కూడా అధికారులతో మరోసారి సమీక్ష నిర్వహించి విద్యుత్, రహదారులు, సమాచార వ్యవస్థల పునరుద్ధరణలో పురోగతిని తెలుసుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్ సిబ్బందిని రప్పించి సరఫరా పునరుద్ధరణను వేగవంతం చేశారు. చివరి వ్యక్తికి సాయం అందే వరకు, ప్రతి సమస్య పరిష్కారమయ్యే వరకు ఇదే వేగంతో పనిచేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
అధికారులు అందించిన వివరాల ప్రకారం, ఏపీఈపీడీసీఎల్ పరిధిలో విద్యుత్ సరఫరా నిలిచిన 5,404 గ్రామాలకు గాను 4,881 గ్రామాల్లో సరఫరా పునరుద్ధరించారు. అంటే దాదాపు 90 శాతం గ్రామాలకు విద్యుత్ అందుబాటులోకి వచ్చింది. ప్రభావితమైన 552 సబ్స్టేషన్లలో 513 పునరుద్ధరించగా మరో 39 సబ్స్టేషన్లలో పనులు కొనసాగుతున్నాయి.
విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో విద్యుత్ సరఫరా నిలిచిన గ్రామాలన్నింటికీ తిరిగి సరఫరా అందించారు. అయితే కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లాల్లో పరిస్థితి ఇంకా సవాలుగానే ఉంది. కోనసీమలో 316 గ్రామాలకు గాను 87 గ్రామాల్లో, పశ్చిమగోదావరిలో 318 గ్రామాలకు గాను 154 గ్రామాల్లో మాత్రమే విద్యుత్ పునరుద్ధరించారు. ఈ రెండు జిల్లాల్లో మరో 393 గ్రామాలకు సరఫరా అందించాల్సి ఉంది. ప్రధాన 33 కేవీ ఫీడర్లు 509కి గాను 489 పునరుద్ధరించగా 11 కేవీ ఫీడర్లు 2,958కి గాను 2,355 అందుబాటులోకి వచ్చాయి.
కృష్ణా జిల్లాలో విద్యుత్ సరఫరా నిలిచిన 915 గ్రామాలకు గాను 867 గ్రామాలకు తిరిగి సరఫరా అందించారు. అటు మొబైల్ సమాచార వ్యవస్థను పునరుద్ధరించడంలోనూ పురోగతి కనిపిస్తోంది. దెబ్బతిన్న 1,045 మొబైల్ టవర్లలో 661 పునరుద్ధరించగా మరో 384 టవర్ల వద్ద పనులు కొనసాగుతున్నాయి. రహదారులపై కూలిన 2,270 చెట్లను తొలగించి రాకపోకలకు అడ్డంకులను తొలగించారు. ఆర్ అండ్ బీ రహదారులపై 137 చోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడగా 119 చోట్ల పునరుద్ధరించారు.
తుపాన్ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 2,425.45 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో ఒకచోట నీటి ప్రవాహం కారణంగా ఒకవైపు నుంచే రాకపోకలు సాగుతున్నాయి. జలవనరుల శాఖ పరిధిలో దెబ్బతిన్న 78 చెరువులు, 22 కాలువలు కలిపి మొత్తం 100 చోట్ల తాత్కాలిక పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయి. మరోవైపు తుపాన్ ప్రభావంతో వ్యవసాయ రంగానికి భారీ నష్టం వాటిల్లింది. 16 జిల్లాల్లో 3 లక్షల 52 వేల 254 హెక్టార్లలో వ్యవసాయ పంటలు, 23 వేల 211 హెక్టార్లలో ఉద్యాన పంటలు ముంపునకు గురయ్యాయి. పంట నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందాలు రాష్ట్రానికి రానుండగా వాస్తవ పరిస్థితులను వివరించి కేంద్ర సాయం పొందేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
అక్టోబర్ 26 నుంచి 29 వరకు కురిసిన వర్షాల వల్ల రాష్ట్రానికి సుమారు 380 టీఎంసీల నీరు వచ్చిందని అధికారులు అంచనా వేస్తున్నారు. సమర్థ నీటి నిర్వహణతో రిజర్వాయర్లలో అదనంగా 4.68 టీఎంసీల నీరు చేరగా మరో 5 నుంచి 6 టీఎంసీలు చేరే అవకాశం ఉందని అంచనా. చిన్న నీటిపారుదల చెరువుల్లోకి 22 టీఎంసీల నీరు చేరగా మరో 8 నుంచి 12 టీఎంసీలు వచ్చే అవకాశముంది.
భూగర్భ జలాలు కూడా 44 టీఎంసీల మేర పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. రాబోయే ఐదు రోజుల్లో గొట్టా బ్యారేజీకి 16.24 టీఎంసీలు, మడ్డువలసకు 12.01 టీఎంసీల నీరు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తుపాన్ నష్టాల నుంచి ప్రజలను గట్టెక్కించడంతో పాటు, పంట నష్టపోయిన రైతులకు అండగా నిలవడం, విద్యుత్, రవాణా, సమాచార వ్యవస్థలను పూర్తిస్థాయిలో పునరుద్ధరించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు కొనసాగిస్తోంది.




