జూన్ 12 తర్వాత ఎప్పుడైనా ఆకస్మిక తనిఖీలు

జూన్ 12 తర్వాత ఎప్పుడైనా ఆకస్మిక తనిఖీలు

– ప్రజలకు అందించే సేవల్లో పూర్తి స్థాయి సంతృప్తి రావాల్సిందే

– ఆర్టీసీలో సౌకర్యాలు, సదుపాయాలు ఇంకా మెరుగు పడాలి

– దీపం లబ్దిదారుల ఖాతాలో ఒకేసారి 3 సిలిండర్ల సొమ్ము

– డాటా అనలిటిక్స్‌కు అన్ని శాఖల్లో అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి

– ప్రభుత్వ పథకాలు, సేవలపై సమీక్షలో సిఎం చంద్రబాబు నాయుడు

 

 

అక్షర ఉదయమ్ – అమరావతి

 

జూన్ 12 తరువాత ఎప్పుడైనా రాష్ట్రంలో ఆకస్మిక తనిఖీలు మొదలు పెడతానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు, వివిధ ప్రభుత్వ సేవలపై సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష చేశారు. ప్రతి వారం నాలుగు శాఖల పరిధిలో పథకాలు, సేవలపై ప్రజల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్‌ను సమీక్షిస్తున్న సీఎం.. రేషన్, దీపం, ఎపిఎస్ఆర్టీసీ, పంచాయతీ సేవలపై వెల్లడైన ప్రజాభిప్రాయాలను పరిశీలించారు. ఈ శాఖల పరిధిలో అమలు అవుతున్న ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రజల నుంచి ఐవిఆర్ఎస్, క్యూ ఆర్ కోడ్ వంటి విధానాల ద్వారా ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. ఈ అభిప్రాయాలపై సిఎస్, సిఎంవో సెక్రటరీలతో ముఖ్యమంత్రి చర్చించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావొస్తుందని, అన్ని శాఖల్లో ప్రభుత్వ పనితీరు, ప్రజా సేవల విషయంలో పూర్తి స్థాయి సంతృప్తి కనిపించాలని సిఎం అన్నారు. కొన్ని శాఖల్లో మార్పు వచ్చిందని, అయితే ఆర్టీసీ వంటి చోట్ల ఇంకా సేవల్లో నాణ్యత పెరగాల్సి ఉందని సిఎం అన్నారు. దీపం 2 పథకం ద్వారా లబ్దిదారులకు ఏడాదికి ఇచ్చే 3 సిలిండర్ల సబ్సిడీ మొత్తాన్ని ఒకేసారి ముందుగానే లబ్దిదారుల ఖాతాలో జమ చేస్తామని సిఎం అన్నారు. లబ్దిదారులు తమకు కావాల్సినప్పుడు దీపం పథకం కింద సిలిండర్ పొందవచ్చు. అయితే వారికి మూడు సిలిండర్లకు ఇచ్చే మొత్తాన్ని ప్రభుత్వం ముందుగానే చెల్లిస్తుంది. దీపం పథకం లబ్దిదారుల నుంచి ఏజెన్సీ వాళ్లు కానీ, ఇతర స్థాయిల్లో గాని ఎక్కడా డబ్బులు అదనంగా వసూలు చేసే పరిస్థితి ఉండకూడదన్నారు.

రేషన్ సరుకుల పంపిణీపై అభిప్రాయాలు

మీరు ఈ నెల రేషన్ సరుకులు తీసుకున్నారా? అని ప్రశ్నించగా 74 శాతం మంది అవునని, వాటి నాణ్యతపై ఎలా ఉంది అంటే బాగుందని 76 శాతం మంది చెప్పారు. రేషన్ పంపిణీలో, నాణ్యతపై ప్రజల సంతృప్తిలో పశ్చిమ గోదావరి జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. అదే విధంగా గ్యాస్ డెలివరీ సమయంలో డబ్బులు డిమాండ్ చేస్తున్నారా? అనే అంశంలో 62 శాతం మంది లేదు అని చెప్పారు. పలు చోట్ల ఈ విషయంలో సమస్య ఉందని, నేరుగా వారి ఖాతాల్లో ముందుగానే డబ్బులు వేయడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం చూపాలన్నారు. ఆర్టీసీ సేవల విషయంలో ప్రయాణికుల నుంచి ఆశించన స్థాయిలో సంతృప్తి వ్యక్తం కాలేదని, ఈ విషయంలో అధికారులు మరింత ప్రభావవంతంగా పని చేయాలని సిఎం చెప్పారు. బస్టాండ్‌లలో తాగునీటి సౌకర్యం, టాయిలెట్ల నిర్వహణ విషయంలో ప్రయాణికుల నుంచి అసంతృప్తి వస్తోందని దీన్ని సరి చేసుకోవాలని సిఎం అన్నారు. తాగునీటిపై 44 శాతం, టాయిలెట్లపై 55 శాతం మంది అసంతృప్తి వెల్లడించారు. ఇక పంచాయతీ సేవల విషయానికి వచ్చే సరికి ఇంటి నుంచి చెత్త సేకరణ జరుగుతుందా? అనే ప్రశ్నకు 60 శాతం మంది అవుననే చెప్పారు. గతంతో పోల్చుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో చెత్త సేకరణ మెరుగైందని సిఎం అన్నారు. రానున్న రోజుల్లో డ్వాక్రా మహిళలకు తడి చెత్త నిర్వహణ బాధ్యత అప్పగించి, కంపోస్ట్ తయారీ చేపడతాం అని సిఎం అన్నారు.

ప్రభుత్వ సేవల్లో డాటా అనలటిక్స్ కీలకం

ప్రభుత్వ సేవల విషయంలో డాటా అనలటిక్స్‌ కీలకమని సిఎం అన్నారు. డాటా ఆధారంగా ఆయా ప్రభుత్వ శాఖల తమ పని తీరును క్షేత్ర స్థాయి నుంచి పరిశీలించు కునేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. ప్రజల నుంచి వచ్చే ఫీడ్‌బ్యాక్‌ను సమర్థ వంతంగా విశ్లేషిస్తే ప్రభుత్వ సేవల్లో అనూహ్య మార్పులు తేవచ్చన్నారు. ఒక ప్రభుత్వ పథకం, లేదా కార్యక్రమంపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తం అవుతున్న సందర్భంలో వాటికి కారణాలను తెలుసుకుని దానికి అనుగుణంగా అధికారులు, ఉద్యోగులు పని చేయాలని అన్నారు. ప్రతి శాఖలో ఉన్నతాధికారులు ఆయా శాఖలపై వచ్చే డాటాపై అనలటిక్స్ ద్వారా సేవలను మెరుగు పరచాలని సిఎం సూచించారు.

వాట్సాప్ గవర్నెన్స్‌లో జూన్ నాటికి 500 సేవలు

వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రస్తుతం 325 సేవలు అందుతున్నాయి. మన మిత్ర ద్వారా వాట్సాప్ సేవలు అందుబాటులోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకు 45 లక్షల మంది ఈ సేవలను విజయవంతంగా వినియోగించుకున్నారు. జూన్ 12వ తేదీ నాటికి 500 సేవలు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి సంబంధించి కసరత్తు జరుగుతోంది. అదే విధంగా ప్రభుత్వ ప్రతిపాదిత డ్రోన్ సిటీ, ఓర్వకల్ ఇండస్ట్రియల్ నోడ్‌లో 300 ఎకరాల్లో ఏర్పాటు కానుంది. ఇందులో మొదటి దశ 116 ఎకరాల్లో నెలకొల్పుతున్నారు. దీనిలో 38 సంస్థలు భాగస్వాములు అయ్యేందుకు ఆసక్తి చూపించాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించి డిపిఆర్ సిద్దం కాగా, టెండర్ల ప్రక్రియ జూన్ 12 నాటికి పూర్తి అవుతుంది.

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..