గవర్నర్లు పంపిన బిల్లులపై రాష్ట్రపతి మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలి

📰 Generate e-Paper Clip

గవర్నర్లు పంపిన బిల్లులపై రాష్ట్రపతి మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలి

– సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

 

అక్షర ఉదయమ్ – న్యూఢిల్లీ

రాష్ట్రపతి పరిశీలన కోసం గవర్నర్లు పంపే బిల్లులను ఉద్దేశించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గవర్నర్లు పంపిన బిల్లులపై రాష్ట్రపతి మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని సూచించింది. గడువు నిర్దేశిస్తూ అత్యున్నత న్యాయ స్థానం ఈతరహా తీర్పు చెప్పడం ఇదే తొలిసారి. తమిళనాడు శాసన సభ ఆమోదించిన పది బిల్లులను రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్.రవి కుమార్ తొక్కి పెట్టడం రాజ్యాంగ విరుద్ధమని ఇటీవల సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఏదైనా బిల్లును మంత్రి మండలి సలహా మేరకు రాష్ట్రపతి ఆమోదం కోసం నిలిపి ఉంచాల్సి వస్తే అందుకు గవర్నర్ తీసుకోదగిన అత్యధిక గడువు ఒక నెల మాత్రమేనని సంచలనాత్మక తీర్పు వెలువరించింది.
ఒక వేళ మంత్రి మండలి సలహా లేకుండా గవర్నర్ బిల్లు ఆమోదాన్ని నిలిపి ఉంచాలని భావించిన పక్షంలో మూడు నెలల్లోగా అలాంటి బిల్లును శాసన సభకు తిరిగి పంపాలని సూచించింది. గవర్నర్ ఈ కాల నిర్దేశాన్ని పాటించని పక్షంలో ఆయన చర్యపై కోర్టులు న్యాయ సమీక్ష జరప వచ్చని వెల్లడించింది. మంత్రి మండలి సలహా సూచనల మేరకు తప్పని సరిగా పని చేయడం తప్ప గవర్నర్ కు విచక్షణ అధికారాలేవీ లేవని, రాజ్యాంగంలోని 200వ అధికరణం కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోందని తెలిపింది. రెండో సారి సమర్పించిన బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం రిజర్వు చేసి ఉంచే అధికారం గవర్నర్ కు లేదంది సుప్రీం.