ఇరిగేషన్ ప్రాజెక్టులే కరవు నుంచి కాపాడతాయి – అందుకే వాటికి ప్రాధాన్యత : ఎల్ నినో ప్రభావంపై 8వ జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్సులో సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

📰 Generate e-Paper Clip

ఇరిగేషన్ ప్రాజెక్టులే కరవు నుంచి కాపాడతాయి – అందుకే వాటికి ప్రాధాన్యత

  • ఎల్‌నినో ప్రభావం రైతులు, వినియోగదారులపై పడనివ్వొద్దు
  • నిత్యావసరాల ధరల నియంత్రణకు యాక్షన్ ప్లాన్ రూపొందించండి
  • డిమాండ్ ఉన్న పంటల సాగుకు ప్రోత్సాహం
  • రైతులకు రాయితీపై విత్తన భరోసా
  • అవసరమైతే కొన్ని పంటలకు కనీస మద్దతు ధర
  • ఎల్ నినో వేళ పంటల బీమా లబ్ది రైతులకు దక్కేలా చర్యలు
  • విపత్తులను ఆపలేం.. ప్రభావాన్ని మాత్రం తగ్గించడం ప్రభుత్వం బాధ్యత
  • ఎల్ నినో ప్రభావంపై 8వ జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్సులో సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

అక్షర ఉదయమ్ – అమరావతి

 

కరవు నుంచి రాష్ట్రాన్ని కాపాడేది ఇరిగేషన్ ప్రాజెక్టులేనని, అందుకే తాను సాగునీటి ప్రాజెక్టులకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. రాష్ట్ర సచివాలయంలో జరిగిన తొలి రోజు 8వ కలెక్టర్ల సమావేశంలో ఎల్ నినో ప్రభావం, తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులకు సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. ఎల్ నినో వేళ రైతులకు అవగాహన కల్పించడంతో పాటు, ధరలు పెరగకుండా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఎల్ నినో కారణంగా పంటలు నష్టపోతే రైతులకు బీమా డబ్బులు వచ్చేలా చూడాలని, ఎట్టిపరిస్థితుల్లో రైతు నష్టపోకూడదని సీఎం సూచించారు. ఎల్ నినో విపత్తు కాలంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించవద్దన్నారు. తాను ఇకపై ప్రతి వారం ఎల్ నినో ప్రభావంపై సమీక్షిస్తానని, క్షేత్ర స్థాయి పర్యటనలు ఈ అంశంపై చేపడతానని తెలిపారు. అలాగే మంత్రులు, అధికారులు, కలెక్టర్లు నిరంతరం క్షేత్ర స్థాయిలో ఉంటూ ఎల్ నినోపై రైతుల్లో, ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ”ఎల్ నినో ప్రభావం రాష్ట్రంపై తీవ్రంగా ఉంది. తాగునీటికి, పశుగ్రాసానికి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. వర్షాధార పంటలను ప్రొత్సహించాలి. ఎల్ నినో సమయంలో నీటి ఇబ్బందులే కాదు, ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉంది. పంటలు సరిగా పండవు కాబట్టి, నిత్యావసరాల ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ధరలను అదుపులో పెట్టేలా మంత్రులు, అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలి. ఈ మేరకు ఓ యాక్షన్ ప్లాన్ సిద్దం చేయాలి. భవిష్యత్తులో ఏ పంటలకు డిమాండ్ ఉంటుందో అంచనా వేయాలి.. ఆ పంటలు వేసేలా రైతులను ప్రొత్సహించాలి. అవసరమైతే ఆ మేరకు రైతులకు సదరు పంటలకు సంబంధించిన విత్తనాలను రాయితీపై సరఫరా చేయాలి. భవిష్యత్తులో డిమాండ్ ఉన్న పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించే అంశాన్ని కూడా పరిశీలించండి. డిమాండ్ ఉన్న పంటలను ప్రొత్సహిస్తే, ఇతర ప్రాంతాల నుంచి దిగుమతులు చేసుకునే అవస్థలు తప్పుతాయి. ఉల్లి, పప్పు ధాన్యాలు, చిరు ధాన్యాల వంటి పంటలను ప్రోత్సహించాలి. మల్టీ క్రాప్స్ వేసేలా చూడాలి. రైతు బజార్లను యాక్టివేట్ చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఏయే పంటలను కొనుగోలు చేస్తోందోననే అంశాన్ని పరిశీలించాలి.”అని సీఎం చంద్రబాబు చెప్పారు.

  • బీమానే రైతులకు ధీమా..

“రైతులకు ఏ రకమైన పంటలకు బీమా చేయించారో.. తెలుసుకుని ఆ రకమైన పంటలు వేయించడం ద్వారా రైతులు బీమా మొత్తాలు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలి. రైతులు ఏయే పంటలకు బీమా చేసుకున్నారోననే అంశంపై జిల్లా కలెక్టర్లు స్పష్టమైన జాబితాలను సిద్దం చేసుకుని.. దానికి అనుగుణంగా రైతుల్లో అవగాహన కల్పించాలి. ఓ రకమైన పంటకు బీమా చెల్లించి.. వేరే పంటలు వేస్తే బీమా వర్తించకుండా పోయే ప్రమాదం ఉంది.. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎల్ నినో విపత్తు కాలంలో ప్రకృతి వ్యవసాయాన్ని.. పీఎండీఎస్ విధానాన్ని ప్రోత్సహించాలి. పచ్చదనం తగ్గకుండా చర్యలు తీసుకోవాలి. వర్షాధార పంటలు వేయడం.. పశుగ్రాసం పండించడం.. చివరి అంశంగా మల్చింగ్ కోసం విత్తనాలు వేసి పచ్చదనం తగ్గకుండా చూడాలి. విత్తనాలను డ్రోన్ల ద్వారా చల్లించే విధానంపై విస్తృతంగా ప్రోత్సహించాలి. తాగు నీటికి, పశుగ్రాసానికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలి. వాతావరణ పరిస్థితులను అంచనా వేసుకోవాలి.. వ్యవసాయ శాస్త్రవేత్తలతో నిరంతరం చర్చించాలి. ఎల్ నినో ప్రభావాన్ని ఎదుర్కొనేలా.. రైతులు, వినియోగ దారులపై భారం పడకుండా చూసేలా ఓ యాక్షన్ ప్లాన్ సిద్దం చేయాలి.”అని ముఖ్యమంత్రి ఆదేశించారు.

  • క్షేత్ర స్థాయిలో ఉండాలి.. రైతుల్లో అవగాహన పెంచాలి

“ఎల్ నినో ప్రభావం మీద ఇకపై ప్రతి వారం సమీక్షిస్తాను.. నేనూ ఫీల్డుకు వెళ్తాను. మంత్రులు, కలెక్టర్లు, ప్రజా ప్రతినిధులు అందరూ క్షేత్ర స్థాయికి వెళ్లాలి.. రైతులకు అవగాహన కల్పించాలి. ఎల్ నినో ప్రభావం రైతుల మీద పడకుండా చూడడంతో పాటు.. వినియోగదారుల మీద పడకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఈ రెండు అంశాలకు హై ప్రయార్టీ ఇవ్వాలి. ఎల్ నినో విపత్తును సవాల్ గా తీసుకుని ఉత్తమ పద్దతులను అవలంభించేలా చర్యలు తీసుకోవాలి. విపత్తులను ఆపలేం. కానీ.. ప్రజలపై ఆ విపత్తుల ప్రభావం పడకుండా చూడడమే ప్రభుత్వాల బాధ్యత. 2019 తర్వాత వచ్చిన ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో చాలా ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి కాలేదు. ప్రాజెక్టులు పూర్తై ఉంటే ఇప్పుడు ఎల్ నినో లాంటి విపత్తుల్లోనూ ఇబ్బందులుండేవి కావు. పట్టిసీమ 8100 క్యూసెక్కుల నీరు డిశ్చార్జి ఉంది. ప్రకాశం బ్యారేజీకి 6700 క్యూసెక్కులు వస్తోంది. ఈ సీజన్ లో పట్టి సీమ నుంచి ఇప్పటి వరకూ 39.5 టీఎంసీల గోదావరి నీరు కృష్ణా డెల్టాకు తీసుకు వచ్చాం. ఈ నీటితోనే తీవ్రమైన ఎల్ నినో పరిస్థితుల్లోనూ డెల్టాలోని లక్షల ఎకరాల సాగును కాపాడ గలిగాం.” అని సీఎం చంద్రబాబు చెప్పారు.

  • వచ్చే వేసవి వరకూ ప్రణాళికలు

“36 ప్రాధాన్యతా ప్రాజెక్టులను 3 ఏళ్ల లోగానే పూర్తి చేయాలి. వెలిగొండ, పోలవరం ఎడమ కాలువ, హంద్రీనీవా కాలువను వేగంగా పూర్తి చేశాం. ఇదే స్పూర్తితో 36 ప్రాజెక్టులను పూర్తి చేయాలి. కరవు నుంచి రాష్ట్రాన్ని కాపాడు కోవటంలో ఈ ప్రాజెక్టులే కీలకం. గోదావరి కావేరి అనుసంధానంతో పాటు జేజేఎం ద్వారా ఇంటింటికీ నీళ్లు ఇచ్చేందుకు ఆస్కారం ఉంటుంది. నిర్దేశిత గడువులోగా నెల ముందే ఆ ప్రాజెక్టులు పూర్తి కావాలి. పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్లకు, అధికారులకు ప్రోత్సాహకాలు ఇస్తాం. సంకల్పం తీసుకుని పనులు చేస్తే ప్రాజెక్టులు పూర్తి చేయటం సులభం అవుతుంది. కరవు నివారణ పనుల్లో భాగంగా షెడ్లు, పశువుల దాణాకు కొరత రాకుండా చూడాలి. ఈ నెలలోనే గ్లోబల్ హార్టీకల్చర్ హబ్ కు శంకుస్థాపన చేస్తాం. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడా తాగునీటి సమస్య రాకుండా చూడాలి. సాధ్యమైనంత మేర చెరువులను నింపి తాగు నీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోండి. వచ్చే వేసవి వరకూ ఇబ్బంది లేకుండా నీటి సరఫరా ప్రణాళికల్ని సిద్ధం చేసుకోవాలి. నీటి లభ్యత లేని ప్రాంతాలకు సమీపంలోని నీటి వనరుల నుంచి వివిధ ప్రాంతాలకు నీటిని తరలించేందుకు చర్యలు చేపట్టాలి. గతంలో తిరుమలకు నీటి ఎద్దడి వచ్చినప్పుడు వంద రోజుల్లోనే పైపు లైన్ వేసి నీటి సంక్షోభాన్ని నివారించాం. ఇప్పటి నుంచే ప్రణాళిక చేస్తే నీటి సంక్షోభాన్ని సులువుగా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. నీటి సరఫరాతో పాటు రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి. జలధార పనులు నిరంతరం కొనసాగాలి. ట్రెంచ్ లు తవ్వకాలు స్ట్రక్చర్ల నిర్మాణం జరగాలి. అన్నమయ్య జిల్లా తరహాలో అంతర్గత బేసిన్లను అనుసంధానించి భూగర్భ జలాలను పెంచండి. చెరువులు నింపే అంశంపై ఓ బ్లూప్రింట్ ను సిద్ధం చేయండి. ఎల్ నినో సంక్షోభ సమయంలో శాఖలన్నీ సమన్వయంతో పని చేయాలి.”అని ముఖ్యమంత్రి సూచించారు. కరవు నివారణ చర్యల్లో భాగంగా పశువుల షెడ్లు, పశువుల దాణాకు కొరత రాకుండా చూడాలి. వ్యవసాయ శాఖతో పాటు పశు సంవర్థక, జల వనరులు, గ్రామీణాభివృద్ధి తదితర శాఖలు సమన్వయంతో పని చేయాలి. హార్టికల్చర్‌ రంగానికి మరింత ప్రోత్సాహం కల్పించే చర్యల్లో భాగంగా ఈ నెలలోనే గ్లోబల్‌ హార్టీకల్చర్‌ హబ్‌కు శంకుస్థాపన చేస్తాం అని ముఖ్యమంత్రి చెప్పారు.