ఏపీలో భారీగా మున్సిపల్ కమిషనర్లు బదిలీ

ఏపీలో భారీగా మున్సిపల్ కమిషనర్లు బదిలీ

 

అక్షర ఉదయమ్ – అమరావతి

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరోసారి భారీగా అధికారుల్ని బదిలీలు చేసింది. మొత్తం పది మంది కార్పొరేషన్లు, మున్సిపాలిటీ కమిషనర్లు బదిలీపై వెళ్లారు. అలాగే పోస్టింగ్ వేచి ఉన్న కొంతమందికి అవకాశం కల్పించారు. ఈ బదిలీలకు సంబందించి పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్‌కుమార్‌ ఉత్తర్వులు విడుదల చేశారు. విజయవాడ కార్పొరేషన్‌లో శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ కె.శివరాం ప్రసాద్‌ బదిలీపై వెళ్లారు. ఆయన్ను ప్రభుత్వం పల్నాడు జిల్లా వినుకొండ మున్సిపల్‌ కమిషనర్‌గా నియమించింది. వినుకొండలో కమిషనర్‌‌గా ఉన్న ఎం.సుభాష్‌ చంద్రబోస్‌కు పోస్టింగ్ ఇవ్వలేదు. ఆయన్ను రాష్ట్ర పురపాలక శాఖ కమిషనర్‌ కార్యాలయంలో రిపోర్ట్‌ చేయాలని ఆదేశించారు.
అనంతపురం కార్పొరేషన్ కమిషనర్‌గా ఎం.జస్వంతరావును నియమించారు. ఆయన మొన్నటి వరకు పోస్టింగ్‌ కోసం వేచి ఉన్నారు. అనంతపురంలో ప్రస్తుతం ఉన్నా కమిషనర్‌ బి.బాలస్వామిని బదిలీ చేశారు. ఆయనకు విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్‌గా పోస్టింగ్ ఇచ్చారు. పల్నాడు పట్టణాభివృద్ధి సంస్థ కార్యదర్శి జి.సాంబశివరావును బదిలీ చేశారు. ఆయన్ను గుంటూరు కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్‌గా పంపించారు. ప్రస్తుతం గుంటూరు డిప్యూటీ కమిషనర్‌‌గా ఉన్న టి వెంకట కృష్ణయ్యను పల్నాడు పట్టణాభివృద్ధి సంస్థ కార్యదర్శిగా బదిలీ చేశారు.
అనంతపురం జిల్లా గుంతకల్లు మున్సిపల్‌ కమిషనర్‌ సీఎంఏ నయీం అహ్మద్‌ను కూడా బదిలీ చేశారు. ఆయన్ను కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్‌ కమిషనర్‌గా నియమించారు. ప్రస్తుతం ఆదోని మున్సిపల్ కమిషనర్‌గా ఉన్న ఎం.కృష్ణను సీఆర్‌డీఏకి బదిలీ చేశారు. ఆయనకు సీఆర్‌డీఏ కమిషనర్‌ పోస్టింగ్‌ ఇస్తారని చెబుతున్నారు. ఏలూరు పట్టణాభివృద్ధి సంస్థ కార్యదర్శిగా పి.సింహాచలంను నియమించారు. సింహాచలం పోస్టింగ్‌ కోసం వేచి ఉన్నారు.. ఇప్పుడు పోస్టింగ్ ఇచ్చారు. ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణాభివృద్ధి సంస్థ కార్యదర్శి ఆర్‌.దేవసేనను బదిలీ చేశారు. బదిలీపై పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మున్సిపల్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌గా ప్రభుత్వం నియమించింది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపల్‌ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ నూర్‌ అలీ ఖాన్‌ను కూడా ప్రభుత్వం బదిలీ చేసింది. కడప జిల్లా కమలాపురం నగర పంచాయతీ కమిషనర్‌గా నియమించింది ప్రభుత్వం. కమలాపురం కమిషనర్‌ బి.ప్రహ్లాద్‌‌కు ఏ పోస్టింగ్ ఇవ్వలేదు. ఆయనను రాష్ట్ర పురపాలక శాఖ కమిషనర్‌ కార్యాలయంలో రిపోర్ట్‌ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు