దాచేపల్లి నగర పంచాయతీపై కన్నేసిన రాజకీయ పార్టీలు

📰 Generate e-Paper Clip

దాచేపల్లి నగర పంచాయతీపై కన్నేసిన రాజకీయ పార్టీలు

 

  • అక్షర ఉదయమ్ – దాచేపల్లి

 

 

పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీపై ప్రధాన రాజకీయ పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి. రానున్న నగర పంచాయతీ ఎన్నికల్లో ఎలాగైనా దాచేపల్లి నగర పంచాయతీపై తమ పార్టీ జెండా ఎగుర వేయాలన్న ఏకైక లక్ష్యంతో అధికార పక్షంలోని తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలు, ప్రధాన పోటీదారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారి వారి వ్యూహాలకు పదును పెడుతున్నాయి.

 

కూటమి తరపున టీడీపీ, జనసేన పార్టీల నుంచి ఒకరిని బరిలోకి దింపే అవకాశాలు సుస్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే కూటమి పార్టీల నుంచి పలువురు ఆశావహులు అభ్యర్థిత్వం కోసం తమ ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. దీంతో కూటమి పార్టీల మధ్య అభ్యర్థిత్వం కోసం పోటీ తీవ్రంగా ఉండబోతోంది. టీడీపీ, జనసేనకు చెందిన పలువురు నాయకులు అభ్యర్థులుగా నామినేషన్ వేసేందుకు సిద్ధం అవువుతున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.

 

మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఇద్దరు ఆశావహులు ప్రధానంగా పోటీలో ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో దాచేపల్లి నగర పంచాయతీ ఎన్నికలపై ఇప్పటి నుంచే రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

 

  • జనసేనకు ప్రత్యేక ఆశలు

 

దాచేపల్లి నగర పంచాయతీపై జనసేన పార్టీ కూడా గట్టి ఆశలు పెట్టుకుంది. నగర పంచాయతీ పరిధిలో కాపు సామాజిక వర్గ ఓటర్లు గణనీయంగా ఉండటంతో జనసేన నాయకత్వం ఈ స్థానంపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు కనిపిస్తుంది. గురజాల అసెంబ్లీ నియోజక వర్గంలో ఉన్న మూడు మున్సిపాలిటీల్లో ఒక మున్సిపాలిటీని జనసేనకు కేటాయించే అవకాశం ఉంటే. దీంతో దాచేపల్లి నగర పంచాయతీ పొత్తులో భాగంగా తమకే దక్కుతుందని జనసేన నాయకులు ఆశిస్తున్నారు.

 

  • పెరుగుతున్న ఆశావహులు – వేడెక్కుతున్న రాజకీయం

 

ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ చైర్మన్ పదవిపై ఆశలు పెట్టుకున్న నాయకుల సంఖ్య గణనీయంగా కూడా పెరుగుతోంది. టికెట్ కోసం ఆయా పార్టీల్లో నేతలు తమ బలాబలాలను చూపించేందుకు ఎవరికి వారు తమ ప్రయత్నాలు ప్రారంభించారు. దీంతో దాచేపల్లి మున్సిపాలిటీలో రాజకీయ వేడి క్రమంగా పెరుగుతోంది.

 

మున్సిపాలిటీపై పట్టు సాధించేందుకు టీడీపీ, జనసేన, వైసీపీలు తమ తమ వ్యూహాలతో ముందుకు సాగుతుండటంతో రానున్న ఎన్నికల్లో దాచేపల్లి నగర పంచాయతీ పోరు రసవత్తరంగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.