జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’
- కుప్పం, చిత్తూరు ఫలితాలతో పక్కాగా కార్యాచరణ
- ఏఐ ఆధారిత ఆరోగ్య సేవలకు అత్యధిక ప్రాధాన్యం
- వైద్యారోగ్యం, సంజీవని ప్రాజెక్టులపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు
అక్షర ఉదయమ్ – అమరావతి
వైద్యారోగ్య సేవలు మరింత మెరుగ్గా అందించేందుకు చేపట్టిన ‘సంజీవని ప్రాజెక్టు’ను జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. డిజిటల్ హెల్త్ రికార్డులతో సంజీవని ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అమలైతే వైద్య సేవల్లో అనూహ్య మార్పులు సాధించ వచ్చని అన్నారు. వైద్య సేవల్లో ఏపీని ఇతర రాష్ట్రాలు అనుసరించేలా ‘సంజీవని ప్రాజెక్టు’ను విజయవంతం చేయాలని సీఎం సూచించారు. క్యాంపు కార్యాలయంలో ‘సంజీవని ప్రాజెక్ట్’పై ముఖ్యమంత్రి అధికారులతో సమీక్షించారు. కుప్పం నియోజకవర్గం, చిత్తూరు జిల్లాల్లో ఇప్పటికే సంజీవని ప్రాజెక్ట్ అమలుతో ఉత్తమ ఫలితాలు వస్తున్నాయని, వీటిని రాష్ట్రమంతటా అమలు చేసేలా చూడాలన్నారు. రాష్ట్రంలో ప్రతీ కుటుంబం విద్యకు, వైద్యానికే అత్యధికంగా ఖర్చు పెట్టాల్సి వస్తోందని.. ఈ వ్యయాన్ని తగ్గించేలా చూసేందుకు సంజీవని వంటి కార్యక్రమాలను తీసుకు వస్తున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు. సంజీవని ప్రాజెక్టులో అధికారిక భాగస్వామిగా ఉన్న టాటా ఎండీ సంస్థ వైద్యారోగ్య రంగంలో సరికొత్త ఆవిష్కరణలకు కృషి చేయాలని నిర్దేశించారు. సంజీవని కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేందుకు 90 రోజుల ప్రణాళిక సిద్ధం చేసినట్టు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. బేస్‌లైన్ అధ్యయనం, డిజిటల్ మౌలిక వసతుల ఏర్పాటు, శిక్షణ, సర్టిఫికేషన్, జాతీయ, రాష్ట్ర పోర్టల్స్‌తో ఇంటిగ్రేషన్ వంటి చర్యలు 90 రోజుల ప్రణాళికలో ఉన్నాయని వెల్లడించారు. 28 జిల్లాల్లో వైద్య సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నట్టు వివరించారు.
– డేటా గోప్యత, భద్రతకు ప్రాధాన్యం
సమీక్షలో సీఎం మాట్లాడుతూ ‘ప్రిడెక్టివ్, ప్రివెంటివ్, క్యూరేటివ్, కాస్ట్ ఎఫెక్టివ్‌గా వైద్య సేవలు అందించాలి. వైద్య సేవలు అందించడంతో పాటు ఆహారపు అలవాట్లు, ఆలోచనా విధానం మారేలా చూడాలి. హోమియోపతి, ఆయుర్వేద, యోగా, ప్రాణాయామం, ఇంకా అత్యాధునిక వైద్య విజ్ఞానాన్ని వినియోగించు కోవాలి. ఏఐ డాక్టర్ కూడా విస్తృతంగా వినియోగంలోకి తీసుకు రావాలి. డేటాను భద్రపరచడం, గోప్యంగా ఉంచడంతో పాటు డ్యాష్ బోర్డు సిద్ధం చేయాలి. ఆస్పత్రుల్లో శానిటేషన్ సహా వివిధ ఔట్ సోర్సింగ్ సేవల విషయంలో దృష్టి పెట్టాలి. సమర్ధవంతంగా వైద్య సేవలు అందించని ఔట్ సోర్సింగ్ సర్వీస్ ప్రొవైడర్లను తొలిగించేలా ఒక విధానం తీసుకు రావాలి. విశ్వాసం పెంచేలా వైద్య సేవలు ఉండాలి. ప్రజల మొబైళ్లకు నేరుగా హెల్త్ అప్డేట్స్ పంపించేలా వ్యవస్థను తీర్చిదిద్దాలి.’ అని చెప్పారు.
- – వ్యాధుల నియంత్రణకు దోహదం
కుప్పం, చిత్తూరు ప్రాంతాల్లో సంజీవని కార్యక్రమం అమలుతో వచ్చిన ఫలితాలను సమీక్షలో ముఖ్యమంత్రి పరిశీలించారు. ప్రాజెక్టు అమలుతో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నట్టు అధికారులు వివరించారు. చిత్తూరులో నమోదైన ఫలితాల ప్రకారం హైపర్‌టెన్షన్ కేసుల్లో 56 శాతం కేసులు నియంత్రణలోకి వచ్చినట్టు తేలిందన్నారు. డయాబెటిస్ కేసుల్లో 16 శాతం కేసుల తీవ్రత తగ్గిందన్నారు. అలాగే, ప్రైమరీ హెల్త్‌కేర్ సేవల వినియోగంలోనూ గణనీయమైన పెరుగుదల నమోదైనట్టు వెల్లడించారు. సంజీవని సేవలపై పౌరుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు నిర్వహించిన సర్వేలో 91 శాతం మంది సంజీవని సేవల అనంతరం తమ ఆరోగ్యంపై అవగాహన పెరిగిందని చెప్పారు. స్క్రీనింగ్ నుంచి చికిత్స, ఫాలోఅప్ వరకు ఏఐ ఆధారిత ఆరోగ్య వ్యవస్థను తీర్చిదిద్దుతున్నట్టు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. సమీక్షలో మంత్రి సత్యకుమార్ యాదవ్, వైద్యారోగ్య శాఖ కార్యదర్శి వీరపాండియన్, సంయుక్త కార్యదర్శి రోణంకి గోపాలకృష్ణ, టాటా ఎండీ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.