అక్షర ఉదయమ్ – ఆచంట

వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ప్రభుత్వం తరపున మొట్ట మొదటి సారిగా పట్టు వస్త్రాలు సమర్పించడం నా పూర్వ జన్మ సుకృతం అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఆర్యవైశ్యుల ఇలవేల్పు, స్త్రీల యొక్క ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పిన కలియుగ పార్వతి దేవి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారని ఆయన అన్నారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని వేడుకుంటే శాంతి, సంపద, రక్షణ ఆశీస్సులు మెండుగా కలుగుతాయని ఆయన చెప్పారు.శఅహింస, ఆత్మ త్యాగానికి, శాంతికి ప్రతిరూపం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారని చంద్రబాబు నాయుడు తెలిపారు. భారత దేశం మొత్తం ఆర్యవైశ్యుల ఆరాధ్య దేవత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి అని, అమ్మ వారికి దేశం మొత్తం ఆలయాలు ఉన్నాయని చంద్రబాబు పేర్కొన్నారు.

ఆర్యవైశ్యులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆర్యవైశ్యుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన తెలియజేశారు. వాట్సాప్ సేవల ద్వారా రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం చేరువై ప్రభుత్వ పథకాలు, వివిధ రకాల సర్టిఫికెట్లను అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని, ఈ అవకాశాన్ని రాష్ట్ర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చంద్రబాబు కోరారు. 2047 సంవత్సరం నాటికి ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ మార్చేందుకు ఒక విజన్ తో కృషి చేస్తున్నామని దీనికి రాష్ట్ర ప్రజలందరూ సహకరించాలని ఆయన సూచించారు.