ఎమ్మెల్యేల పని తీరుపై సిఎం చంద్రబాబు కీలక నిర్ణయం

ఎమ్మెల్యేల పని తీరుపై సిఎం చంద్రబాబు కీలక నిర్ణయం
– వారికి వార్నింగ్..!

 


అక్షర ఉదయమ్ – అమరావతి

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కూటమి పాలన ఏడాది పూర్తి చేసుకుంటున్న సందర్భంగా, జూన్ 12న విజయోత్సవ ర్యాలీలు నిర్వహించాలని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం ఆర్థికంగా దిగజార్చినా, అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నామని ఆయన అన్నారు. ప్రజలకు ప్రభుత్వం చేసిన మంచిని వివరించాలని, గత ప్రభుత్వ తప్పిదాలను గుర్తు చేయాలని కార్యకర్తలకు సూచించారు. పని తీరు ఆధారంగా ప్రోత్సాహం ఉంటుందని, తప్పిదాలు చేస్తే మాత్రం చర్యలు తప్పవని హెచ్చరించారు. రానున్న రోజుల్లో మరింత బాధ్యతగా పని చేయాలని నేతలకు దిశా నిర్దేశం చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కూటమి పాలనకు ఏడాది పూర్తి అవుతోంది. జూన్ 12వ తేదీతో ఏపీలో ఎన్డీఏ కూటమి పాలనకు ఏడాది పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో జూన్ 12వ తేదీన ఏడాది పాలనపై అన్ని నియోజక వర్గాలలో విజయోత్సవ ర్యాలీలు నిర్వహించాలని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ స్థాయిల్లోని పార్టీ నేతలతో శనివారం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జూన్ 12న విజయోత్సవ ర్యాలీలు నిర్వహించాలని చంద్రబాబు ఆదేశించారు. అదే రోజు సాయంత్రం ఎన్డీఏ పక్షాలు, అధికారులతో వచ్చే నాలుగేళ్లలో చేపట్టే కార్యక్రమాలపై అమరావతిలో సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు చంద్రబాబు తెలిపారు.

ఈ ఏడాది పాలనలో స్పష్టమైన మార్పు చూపించామన్న చంద్రబాబు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని పార్టీ నేతలకు సూచించారు. 1995, 2014లో అధికారంలోకి వచ్చిన సమయంలో ఇన్ని ఇబ్బందులు చూడలెదని చంద్రబాబు అభిప్రాయ పడ్డారు. వైసీపీ ప్రభుత్వం పాలనలో ఆర్థికంగా రాష్ట్రాన్ని పాతాళానికి తొక్కేశారని ఆరోపించారు. అయినా సమస్యలు చూసి పారి పోలేదని. తీసుకునే నిర్ణయాలతోనే మంచి ఫలితాలు సాధిస్తున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగానే టీడీపీ శ్రేణులకు చంద్రబాబు కీలక సూచనలు చేశారు. ప్రజలకు మనం చేసే మంచిని చెప్పాలని, గత ప్రభుత్వ అరాచకాలను గుర్తు చేయాలని చంద్రబాబు సూచించారు. పార్టీ నేతల పని తీరు, ప్రభుత్వం పని తీరుపై సర్వేలు చేయిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రతి సమాచారాన్ని తెప్పించు కుంటున్నానని, బాగా పని చేసిన వారికి ప్రోత్సాహం తప్పకుండా ఉంటుందన్నారు. పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తే ఎవరినైనా వదులు కుంటానంటూ చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. తొలిసారిగా గెలిచిన ఎమ్మెల్యేలు మరింత బాధ్యతగా పని చేయాలని.. ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని సూచించారు.

ఎమ్మెల్యేలు అతి విశ్వాసానికి పోవద్దని.. ఓవర్ కాన్ఫిడెన్స్‌కు పోతే ఎక్కువ నష్టం జరుగుతుందని అన్నారు. వన్‌టైమ్ ఎమ్మెల్యేలుగా మిగిలి పోకూడదనేది తన ఆలోచనగా చెప్పిన చంద్రబాబు.. ప్రజలు గమనిస్తున్నారనే సంగతిని గుర్తుంచుకుని పని చేయాలని సూచించారు. ప్రతి ఆరు నెలలకు ఓ సారి ఎంపీలు, ఎమ్మెల్యేల పని తీరుపై సర్వేలు చేయిస్తున్నానని చంద్రబాబు తెలిపారు. మంచి చేస్తే అభినందించి ప్రోత్సహిస్తానని.. అవకాశాలు కల్పిస్తానన్న చంద్రబాబు.. తప్పు చేస్తే మాత్రం దూరం పెడతానని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి రాజీ లేదని.. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు.

మెజారిటీ ఎమ్మెల్యేలు, ఎంపీలు మంచిగా పని చేస్తున్నారన్న చంద్రబాబు.. ఒకరిద్దరు వల్ల అక్కడక్కడా నష్టం కూడా జరుగుతోందని అభిప్రాయపడ్డారు. త్వరలోనే ఒక్కో ఎమ్మెల్యేతో ముఖాముఖి భేటీలు నిర్వహించనున్నట్లు చంద్రబాబు తెలిపారు. పని తీరును ఎప్పటికిప్పుడు సమీక్షించుకోవాలన్న సీఎం.. మంచి, చెడులు తెలుసుకుని బాధ్యతగా పని చేయాలని పార్టీ నేతలకు సూచించారు.

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..