గత వైసిపి ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసింది : గురజాల ఎమ్మెల్యే యరపతినేని

– గురజాల ఎమ్మెల్యే యరపతినేని

 

అక్షర ఉదయమ్ – పిడుగురాళ్ళ 

 

గత వైసిపి ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసిందని గురజాల శాసన సభ్యులు యరపతినేని శ్రీనివాసరావు విమర్శించారు. ఆయన అనేక అంశాలను ప్రస్తావిస్తూ బుధవారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఏడాదికి రూ.71 వేల కోట్లు అసలు, వడ్డీ చెల్లింపు భారం లక్షా 40 వేల కోట్లు ప్రభుత్వంపై పడిందని ఆయన తెలిపారు. గడచిన 7 మాసాల్లో ఆరోగ్యశ్రీ, ధాన్యం బకాయిలు, ఫీజు రీయంబర్స్ మెంట్ లాంటి జగన్ ప్రభుత్వ బకాయిలు రూ.22 వేల కోట్లను చంద్రబాబు ప్రభుత్వం చెల్లించిందని యరపతినేని చెప్పారు. అప్పులు కూడా పుట్టని స్థితి ఏర్పడిందని, ఏడాదికి రూ.71 వేల కోట్ల రూపాయల అసలు, వడ్డీ చెల్లించాలని, ఇవి చంద్రబాబు ప్రభుత్వానికి గుదిబండలా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు.

 

డిగ్రీ ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలు రూ.2,832 కోట్లు, ఫీజు రీయంబర్స్ మెంట్లు 450 కోట్లు, చిక్కిలు, కోడిగుడ్లు రూ.256 కోట్లు, వసతి దీవెన రూ.989 కోట్లు, ఆరోగ్య శ్రీ బకాయిలు రూ.1800 కోట్లు, ధాన్యం బకాయిలు రూ.1600 కోట్లు, ఉద్యోగులకు బకాయిలు రూ.20,000 కోట్లు, ఇరిగేషన్ కాంట్రాక్టర్ల బకాయిలు రూ.19,000 కోట్లు, గృహ నిర్మాణం బకాయిలు రూ.7,800 కోట్లు, ఉపాధి హామీ బకాయిలు రూ. 2,100 కోట్లు ఇలా జగన్ ప్రభుత్వం పెట్టిన మొత్తం బకాయిలు రూ.1.40 లక్షల కోట్లు ఉన్నాయని వివరించారు. ఈ స్థాయిలో గతంలో ఏ ప్రభుత్వం బకాయిలు పెట్టలేదని, తెచ్చిన అప్పులు ప్రభుత్వ ఆదాయం పెంచే సాగు నీటి ప్రాజెక్టులు, అమరావతి నిర్మాణం లాంటి వాటిపై కాకుండా విలాసాలు, జల్సాలకు ఖర్చు చేసి తినేశారని దుయ్యబట్టారు. జగన్ విలాసాలు, జల్సాలకు ప్రభుత్వ ధనం దుబారా రూ.19,871.35 కోట్లని, సచివాలయాలకు వైసీపీ రంగులు వేసేందుకు, తొలగించేందుకు రూ.3,000 కోట్లు ఖర్చు చేశారని, రుషి కొండపై విలాస వంతమైన భవన నిర్మాణానికి రూ.600కోట్లు, ప్రకటనల పేరుతో సాక్షికి రూ.500కోట్లు, తాడేపల్లి ప్యాలెస్ నిర్వహణకు ప్రజాధనం ఖర్చు రూ.15.25కోట్లు, తాడేపల్లి ప్యాలెస్ లో పెన్ను, పేపర్ల ఖర్చు రూ.9.845 కోట్లు, మద్యం షాపుల్లో ఎలుకలు పట్టడానికి అయిన ఖర్చు రూ.1.365 కోట్లు, జగన్ ఫ్యామిలీతో పర్సనల్ టూర్ ఖర్చు రూ.22.52 కోట్లు ఇలా మొత్తం జగన్ విలాసాలకు, జల్సాలకు ప్రభుత్వ ధనం దుబారా అయిన ధనం మొత్తం 19,871.35 కోట్ల రూపాయలని అన్నారు.

 

అయిదేళ్లలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ రెడ్డి రూ.8 లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టారని, భూ కేటాయింపులు, గనుల తవ్వకాలు, సోలార్ కు అనుమతులు ఇలా ప్రతి దాంట్లో ఆశ్రిత పక్షపాతానికి ఒడిగట్టి లక్షల కోట్లు సంపాదించారని యరపతినేని శ్రీనివాసరావు ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ గుండెకాయ లాంటి సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టారని, టీడీఆర్ బాండ్లు, స్మార్ట్ మీటర్ల కొనుగోళ్లు, రేషన్ బియ్యంలో చేతివాటం చూపారని, చివరికి చిన్నారుల పోషణకు పెట్టే చిక్కీలు, కోడిగుడ్లు వంటి వాటిల్లో కూడా పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని తీవ్ర విమర్శలు చేశారు. లిక్కర్ కమిషన్, 22(ఎ), అసైన్డ్ భూముల కుంభకోణం, ఇండోసోల్ కుంభకోణం, జి.ఐ.ఎస్ విద్యుత్ ఒప్పందాల కుంభకోణం, టీడీఆర్ బాండ్ల కుంభకోణం, విశాఖ భూముల కుంభకోణం, ఇసుక దోపిడీ, ఎర్రచందనం కుంభకోణం, గ్రావెల్ దోపిడీ, సిలికా, బీచ్ శాండ్, క్వార్జ్ దోపిడీ, గంజాయి, డ్రగ్స్ వాటా, ప్రభుత్వ కొనుగోళ్లలో కమిషన్లు, కూకట్ పల్లిలో 11 ఎకరాలు, లేపాక్షి భూములు, స్మార్ట్ మీటర్లు, ట్రాన్స్ ఫార్మర్ల కొనుగోలు, తదితరాల్లో, కోవిడ్ మందులు, కిట్ల కొనుగోళ్లలో, భారతి సిమెంట్ దోపిడీ, పోర్టుల్లో అవినీతి, సాగునీటి ప్రాజెక్టుల్లో కమిషన్లు, సాక్షికి ప్రకటనల రూపంలో దోపిడీ ఇలాంటి కారణాల వల్ల ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ దివాళా తీసిందని పేర్కొన్నారు. ఇది నేటి చంద్రబాబు ప్రభుత్వానికి గుదిబండగా తయారై, ప్రజల పాలిట శాపంగా మారిందని గురజాల శాసన సభ్యులు యరపతినేని శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు.