ఇక నుంచి సహజీవనానికి రిజిస్ట్రేషన్ తప్పనిసరి?

అక్షర ఉదయమ్ – అమరావతి: ఇకపై సహజీవనం చేయాలంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరి. అంతేకాక అన్ని మతాల పెళ్లిళ్లకు ఇప్పటి నుంచి ఒకటే రూల్ వర్తించనుంది. ఈ రూల్ ఈరోజు నుంచి అమల్లోకి రానుంది.

అవును వివాహం, విడాకులు, వారసత్వం వంటి విషయాల్లో అందరికీ ఒకే తరహా నిబంధనల కోసం ఉద్దేశించిన ఉమ్మడి పౌర స్మృతి (UCC) జనవరి 27 నుంచి ఉత్తరాఖండ్ లో అమల్లోకి రానుంది.

గతేడాది ఫిబ్రవరిలో ఈ విధానాన్ని ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును ఆమోదించిన తొలి రాష్ట్రంగా నిలిచింది. ఈ బిల్లును తాము కూడా తీసుకొస్తామని రాజస్థాన్‌ ఇప్పటికే ప్రకటించింది.

అయితే తాజాగా ఈ విషయాన్ని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ధ్రువీకరించారు. దేశంలో యూసీసీని అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అవతరించనుందని అన్నారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు, విధానాలను పూర్తి చేశామన్నారు.

ఈ చట్టం అమలుపై సంబంధిత అధికారులకు శిక్షణ కూడా ఇచ్చామని తెలిపారు. మీడియాతో మాట్లాడిన ధామి.. యూసీసీ అమలు వలన అన్ని మతాలు, కులాలు ఒకే తాటిపైకి వస్తాయన్నారు. ఎలాంటి వివక్ష ఉండదని వివరించారు. పౌరులందరికీ సమానమైన హక్కులు, బాధ్యతలు దక్కేలా చూస్తామని వెల్లడించారు.

2022 అసెంబ్లీ ఎన్నికల్లో యూసీసీను అమలు చేస్తామని మాట ఇచ్చామని.. ప్రధాని మోదీ నాయకత్వంలో ఆ ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామన్నారు.

ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానానికి అనుగుణంగా యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఉత్తరాఖండ్ లో ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ యూసీసీ నే బీజేపీ ప్రధానాస్త్రంగా ఉంటోంది. ఎట్టకేలకు ఈ సారి అమలు చేసేందుకు మార్గం సుగమమైంది.